దారుణం: వాటర్ ట్యాంకులో పది రోజులుగా వ్యక్తి మృతదేహం, అవే నీళ్లు తాగిన జనం
ఇటీవలే ఓ నీటి ట్యాంకులో పదుల సంఖ్యలో కోతులు చనిపోయిన ఘటన మరువక ముందే నల్గొండలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. నల్గొండలోని పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపుతోంది. గత పది రోజులుగా పలు వార్డుల ప్రజలు అదే నీళ్లను తాగడంతో భయాందోళనలకు గురవుతున్నారు.
తాగునీరు తేడాగా ఉన్నాయంటూ 11వార్డు ప్రజలు అధికారుల్ని నిలదీయడంతో.. పురపాలక సిబ్బంది తనిఖీలు చేయడంతో వాటర్ ట్యాంకులో మృతదేహం లభ్యమైంది. కాగా, ఈ మృతదేహం హనుమాన్‌నగర్‌కు చెందిన ఆవుల వంశీ కృష్ణదిగా గుర్తించారు. అతడు మే 24 నుంచి కనిపించడం లేదని, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో మున్సిపాలిటీ సిబ్బందిపై స్థానికులు మండిపడ్డారు. నీళ్లను అందించే విషయంలో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే నాగార్జున సాగర్‌లోని మంచి నీళ్ల ట్యాంక్‌లో 30 కోతులు పడి చనిపోయిన ఘటన మరువక ముందే ఈ ఘటన జరగడంతో సంబంధిత అధికారుల తీరుపై నల్గొండ ప్రజలు మండిపడుతున్నారు.
ఇది ఇలాఉండగా, తాగునీటి ట్యాంకులో మనిషి మృతదేహం లభ్యం కావడం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు తీరు మారకపోతే.. జనం తరిమికొట్టడం ఖాయమని అన్నారు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన అని అంటూ ధ్వజమెత్తారు. ః
కోతల్లేని కరెంట్ ఇవ్వలేరు సరికదా, కోతకొచ్చిన పంటకు సాగు నీళ్లు కూడా ఇవ్వలేరని కేటీఆర్ విమర్శించారు. అలానే కోతులు పడి చనిపోయినా వాటర్ ట్యాంకులను పట్టించుకోరంటూ ఎద్దేవా చేశారు. చివరికి, నల్గొండలోని నీటిట్యాంకులో పది రోజులుగా శవం ఉన్నా నిద్రలేవరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది ప్రజాపాలన కాదు..
— KTR (@KTRBRS) June 3, 2024
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన..
కోతల్లేని కరెంట్ ఇవ్వలేరు..
కోతకొచ్చిన పంటకు సాగునీళ్లు ఇవ్వలేరు..
కోతులు పడి చనిపోయినా వాటర్ ట్యాంకులను పట్టించుకోరు
చివరికి..
నల్గొండలోని నీటిట్యాంకులో పదిరోజులుగా శవం ఉన్నా నిద్రలేవరు
సాగర్ ఘటన స్మృతిపథం నుంచి… https://t.co/PideCtuwCH
'సాగర్ ఘటన స్మృతిపథం నుంచి చెరిగిపోకముందే..కాంగ్రెస్ సర్కారులో మళ్లీ అదే నిర్లక్ష్యం.. అదే నిర్లిప్తత. సురక్షిత మంచినీళ్లు కూడా ఇవ్వలేని సర్కారిది.. ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేసిన గలీజు పాలన ఇది. మిషన్ భగీరథ పథకంతో.. దశాబ్దాల తాగునీటి తండ్లాటను తీరిస్తే.. కనీసం నీటిట్యాంకుల నిర్వహణ కూడా చేతకాని అసమర్థ ప్రభుత్వమిది. గుర్తుంచుకోండి.. జలమే జగతికి మూలం.. ఈ సర్కారు తీరు మారకపోతే.. జనమే కాంగ్రెస్‌ను తరిమికొట్టడం ఖాయం' అంటూ రేవంత్ సర్కారుపై కేటీఆర్ విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications