టమోటా సాగుతో రూ.3 కోట్లు ఆర్జించిన మెదక్ రైతు: సన్మానించిన కేసీఆర్
హైదరాబాద్: మార్కెట్‌లో టొమాటో ధర ఆకాశానికి ఎగబాకింది. రోజులు గడుస్తున్నా వాటి రేట్లు నేలకు దిగిరావట్లేదు. ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు. టొమాటో.. బంగారం ధరను తలపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా కేజీ టొమాటో.. మార్కెట్‌లో 150 నుంచి 200 రూపాయల వరకు పలుకుతోంది.
ఇదే టొమాటో ధర.. గతంలో రైతులను కంటతడి పెట్టించిన ఉదంతాలు లేకపోలేదు. టొమాటో విక్రయాల వల్ల కనీసం ఆటో ఛార్జీలు కూడా దక్కట్లేదనే కారణంతో వాటిని రోడ్ల పక్కన పడేసి వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. చేతికి అందిన పంటను దుక్కి దున్నిన రోజులూ చాలానే ఉన్నాయి. ఇప్పుడు కిలో టొమాటో మీద ఎంత లేదన్నా రైతులు 150 రూపాయల వరకు లాభాలను అందుకుంటోన్నారు.

ఇదే టమోటాను పండించిన తెలంగాణ రైతు బీ మహిపాల్ రెడ్డి.. కోట్ల రూపాయలను ఆర్జించారు. ఈ ఒక్క సీజన్‌లోనే టమోటాను సాగు చేయడం ద్వారా రెండు కోట్ల రూపాయలను ఆర్జించారాయన. ప్రస్తుతం మరో కోటి రూపాయల విలువ చేసే టమోటా అమ్మకాలకు ఉంచారు. ఒకట్రెండు రోజుల్లో అవి కూడా అమ్ముడుపోతాయని ఆశిస్తోన్నారు.
10వ తరగతి ఫెయిల్ అయిన మహిపాల్ రెడ్డి చదువును మానేసి, వ్యవసాయం వైపు మళ్లారు. వరి సాగు ఆశించిన దిగుబడులు ఇవ్వకపోవడంతో నష్టపోయారు. టమాటా రూపంలో ఆయనకు జాక్ పాట్ తగిలింది. జూన్ 15 నుంచి ఇప్పటి వరకు టమోటాలను విక్రయించడం ద్వారా రెండు కోట్ల రూపాయలను సంపాదించారు.
మెదక్‌లోని కౌడిపల్లి ఆయన స్వగ్రామం. వంద ఎకరాల పొలం ఉందాయనకు. అందులో ఎనిమిది ఎకరాల్లో టొమాటో సాగును మొదలుపెట్టారు. ఏప్రిల్ 15వ తేదీన టమోటా సాగు ఆరంభించారు. ఏ- గ్రేడ్ టమోటాను పండించారు. అద్భుతమైన దిగుబడిని సాధించారు. అధిక వర్షం వల్ల పంటను కొంత నష్ట పోయినప్పటికీ నిరుత్సాహ పడలేదు.
ఈ సీజన్‌లో మొత్తంగా రెండు కోట్ల రూపాయలను ఆర్జించారు. మరో కోటి రూపాయల విలువ చేసే పంట కోతకు సిద్ధంగా ఉంది. తనకు ఉన్న పొలంలో 60 ఎకరాల్లో వరి, మిగిలిన 40 ఎకరాల్లో కూరగాయలు, టమాటా సాగు మొదలుపెట్టానని, సరైన మెళకువలతో అధిక దిగుబడిని సాధించినట్లు వివరించారు.
ఈ సాయంత్రం మహిపాల్ రెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. భార్యతో కలిసి ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను మర్యాదపూరకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. వ్యవసాయంలో మరిన్ని మెళకువలను అనుసరించాలని, పంట దిగుబడిని పెంచుకోవాలని సూచించారు. మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి.. తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications