పర్యాటకాన్ని గాడిలో పెట్టే పనిలో మంత్రి జూపల్లి.. హరిత రిసార్ట్స్ లో ఆకస్మిక తనిఖీలు!!
హరిత తారామతి బారదారి రిసార్ట్స్ లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రిసార్ట్ నిర్వహణ లోపాల పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హరిత రిసార్ట్స్ మొత్తం కలియతిరిగి హరిత హోటల్ రూమ్స్, హరిత రెస్టారెంట్, పుష్పాంజలి ఆంఫీ థియేటర్, స్విమ్మింగ్ పూల్, ఆడిటోరియం, టాయిలెట్స్ లను పరిశీలించారు. హరిత రిసార్ట్స్ నిర్వహణ పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
హరిత రిసార్ట్ లో ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి జూపల్లి
హరిత రిసార్ట్స్ లో ఆహ్లాదకర వాతావరణం లేదని, ఎంట్రన్స్ గుంతల మయంగా ఉందని, చెత్తాచెదారం లేకుండా చూడాలని, పరిశుభ్రత పాటించాలని, వెంటనే వ్యవస్థను సెట్ చేయాల్సిందిగా అక్కడ ఉన్న అధికారులను ఆదేశించారు. ఉద్యోగులు, సిబ్బంది ఎంతమంది ఉన్నారు? వేతనాలు సకాలంలో అందుతున్నాయా లేదా? ఇక రిసార్ట్స్ లో వసతులు కల్పన పైన కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

హరిత హోటళ్ళ అభివృద్ధికి కృషి
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్రంలో హరిత పర్యాటక హోటళ్ళలో పర్యాటకులు, సందర్శకులకు మెరుగైన వసతులను కల్పిస్తూ మూడు నాలుగు నెలల్లో అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆదాయం పెంచడంతో పాటు ఆహ్లాదకర వాతారవణం ఉండేలా తీర్చిదిద్దుతామన్నారు. అవసరం అయితే ఇందుకోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
గోల్కొండ ఫెస్టివల్ ఘనంగా నిర్వహిస్తాం
ప్రపంచ పర్యాటకులను ఆకర్షించటానికే తమ ప్రభుత్వం కృషిచేయనున్నట్లు, భవిష్యత్ లో గోల్కొండ ఫెస్టివల్ నిర్వహించడానికి చర్యలు చేబడుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్ లోని హరిత తారామతి బారదారి రిసార్ట్ గురించి మాట్లాడిన ఆయన తారామతి బారదారి ప్రైమ్ లొకేషన్ లో విశాలమైన స్థలంలో ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో ఆదాయం రావడం లేదన్నారు మంతి జూపల్లి కృష్ణారావు .
హరిత తారామతి బారదారి రిసార్ట్ లో నిర్వహణా లోపంపై ఆగ్రహం
హరిత తారామతి బారదారి రిసార్ట్ లో నిర్వహణలోపమే ప్రధాన కారణమన్న మంత్రి ఇకపై నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటిస్తామనీ, ప్రభుత్వ సంస్థలను కూడా ప్రైవేట్ తో పోటీ పడేలా తీర్చిదిద్దుతామనీ చెప్పారు. అందరూ తమ విధులను తూచా తప్పకుండా నిర్వహించాలన్నారు. ఆయనతో పాటు పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ నాయుడు సహా పలువురు ఉన్నతాధికారులూ ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications