కేసీఆర్ తడాఖా ఏంటో అప్పుడే తెలిసింది!
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు అటు మంత్రులు.. ఇటు కాంగ్రెస్ నేతలు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి.. కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఇప్పటికైనా బయటకు వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు మంత్రి కోమటిరెడ్డి.
ఇక రేపట్నుంచి కేసీఆర్‌ను ఎండగట్టడాన్ని తెలంగాణ ప్రజలు చూస్తారని మంత్రి అన్నారు. దళితులకు మూడెకరాలు భూమి ఇచ్చావా? అని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తానని చేస్తానని చెప్పి ఇచ్చావని నిలదీశారు. రేపట్నుంచి తడాఖా చూపిస్తానని కేసీఆర్ అంటున్నారు.. ఆయన తడాఖా ఏంటో పార్లమెంటు ఎన్నికల్లో చూశాం కాదా అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు.

పదహారు లోక్‌సభ స్థానాల్లో ప్రచారం చేస్తే.. తొమ్మిదింటిలో డిపాజిట్ కూడా రాలేదని కేసీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి చురకలంటించారు. నువ్వేం నాయకుడివని ఎద్దేవా చేశారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్రే లేదని అన్నారు. తనలాంటి వాళ్లు మంత్రి పదవికి రాజీనామా చేస్తే తెలంగాణ వచ్చిందన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కేసీఆర్ దొంగ దీక్షలు చేశారని ఆరోపించారు.
పదేళ్లు కేసీఆర్ మాటలతోనే రాజకీయ చేశారన్నారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. బయటికి వస్తా అంటున్నావ్.. కదా ఏ జిల్లాకు పోదాం చెప్పు. పదేళ్లు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు. రాష్ట్ర ప్రజల నెత్తిన ఏడు లక్షల కోట్ల అప్పులు పెట్టావు అని కేసీఆర్‌పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.
కేసీఆర్ ఫాంహౌస్‌లో అసెంబ్లీ సమావేశాలు పెట్టాలా?
కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి రావాలని కోరారు.. ప్రతిపక్ష నేత సభ పెట్టాలని అడగాలి కానీ.. ఇక్కడ రివర్స్ జరుగుతోందన్నారు. మీరు ఫాంహౌస్ నుంచి బయటికి రారు.. ఎవరు వచ్చినా.. మీ ఇంటి దగ్గరికే రావాలి. అసెంబ్లీకి మీరు రారు. అసెంబ్లీని మీ ఇంటికి తీసుకురావాలా మరి!? అని కేసీఆర్‌కు చురకలంటించారు.
కేసీఆర్ కొడితే మామూలుగా ఉండదు అంట.. ఏం కొడతావు.. మాటల్లో ఉన్న బలం.. చేతల్లో లేదు. మా కార్యకర్తలకు కోపం వచ్చి ఉఫ్ అని అంటే గాలికి కొట్టుకుపోతావు అని జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. తులం బంగారానికి ఆశ పడ్డారని తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారా? అని మండిపడ్డారు. ఇందుకు రాష్ట్ర ప్రజలు, మహిళకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నీకు ఓట్లేస్తే జనం మంచివాళ్లు.. ఓటేయకపోతే మంచివాళ్లు కాదా? అని ప్రశ్నించారు. అధికారం పోయిందనే బాధ కేసీఆర్‌లో కనిపిస్తోందని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications