ఆ ఒక్క నియోజకవర్గంలో పేరు మార్పు?
తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఒకవైపు నుంచి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన.. మరోవైపు నుంచి మంత్రి హరీష్ రావుపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఘాటు విమర్శలతో కూడిన రాజకీయ మబ్బులు తెలంగాణను పూర్తిగా కమ్మేశాయి. తన కొడుక్కి మెదక్ టిక్కెట్ ఇవ్వనందుకు హరీష్ రావుపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలు, ప్రవర్తనను మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు.
పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి హరీష్ రావు వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారని, పార్టీకి మూలస్తంభంగా ఉన్న హరీష్ కు పార్టీ శ్రేణులంతా అండగా ఉంటాయని స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ ఈమేరకు ట్వీట్ చేశారు. తిరుమల దర్శనానికి వెళ్లిన మైనంపల్లి హన్మంత రావు.. మంత్రి హరీష్ రావు మెదక్ జిల్లాలో పెత్తనం చేస్తున్నాడని... ఓ డిక్టేటర్‌లా ప్రవర్తిస్తున్నాడంటూ మండిపడ్డారు.

అక్రమంగా లక్ష కోట్లరూపాయలు సంపాదించాడని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తాను మల్కాజిగిరి నుంచి, తన కుమారుడు మెదక్ నుంచి పోటీచేస్తామని చెప్పారు. సిద్ధిపేటలో తన తడాఖా చూపిస్తానని, మంత్రి హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తానంటూ హెచ్చరించారు. మెదక్ నుంచి తన కుమారుణ్ని కచ్చితంగా గెలిపించుకుంటానని, పార్టీ తనకు టికెట్ ప్రకటించిందని, కానీ తన కుమారుడికి కూడా టికెట్ ఇస్తేనే తాను పోటీచేస్తానని స్పష్టం చేశారు.
మైనంపల్లి హన్మంత రావు ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సమయానికే భారత రాష్ట్ర సమితి అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. ఆ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఇంత సీరియస్‌గా స్పందించడం చూస్తుంటే.. లిస్టులో మార్పులు జరిగే అవకాశమున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జాబితా ప్రకటించిన సమయంలో కేసీఆర్ కూడా ఈ డైలాగ్ చెప్పటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మైనంపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతోపాటు టికెట్ కూడా నిరాకరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications