ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో వారికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి!
తెలంగాణ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదల కోసం ఇల్లు కట్టించాలన్న లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు గృహ నిర్మాణాలను చేపట్టింది. అర్హులైన వారికి ఈ పథకం వర్తించాలని భావించి సర్వే నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేసింది. ఇక ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టి శరవేగంగా పనులు జరిగేలా చూస్తోంది.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఇక ఈ క్రమంలోనే తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకం పైన రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం నిజమైన అర్హులకు మాత్రమే వర్తించాలని అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. అందుకే లబ్దిదారుల ఎంపిక నేరుగా వారి వద్దకే వెళ్లి చేసినట్టు ఆయన పేర్కొన్నారు.

తప్పు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఇంజనీర్ లదే
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎక్కడ ఎటువంటి తప్పు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఇంజనీర్ లది అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.న్యాక్ లో శిక్షణ పూర్తి చేసుకున్న 390 మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు రిజిస్ట్రేషన్ శాఖలో పదోన్నతి లభించగా, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ఆయన రిజిస్ట్రేషన్ శాఖలో పదోన్నతి పొందిన ఇంజనీర్లు గృహనిర్మాణశాఖ కు మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు.
తప్పు జరిగితే కఠిన చర్యలు
ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంలో తప్పు జరిగింది అని తెలిస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఈ మేరకు త్వరలో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు
ఎక్కడైనా తప్పు జరిగినట్టు తెలిస్తే ఎవరైనా సరే తక్షణం ఆ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ప్రభుత్వం నిరుపేదలకు అందించే ఏ పథకం అయినా పారదర్శకంగా అమలు జరగాలని చూస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications