రామప్ప ఆలయంలో కవిత పూజలు: బీఆర్ఎస్ దూసుకెళ్తోందంటూ బీజేపీ, కాంగ్రెస్‌పై విమర్శ
భూపాలపల్లి: కేంద్రం దేశ వ్యాప్తంగా సింగరేణిని ప్రైవేటు పరం చేస్తోందని.. తెలంగాణలో సింగరేణిని కాపాడుకుంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత్ స్పష్టం చేశారు. భూపాలపల్లిలో మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి కవిత ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం బీఆర్ఎస్, తెలంగాణ జాగృతి కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.

సింగరేణిని ప్రైవేటీకరించాలన్న కుట్రను అడ్డుకున్నాం: కవిత
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కవిత మాట్లాడుతూ.. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను అడ్డుకున్నవారు ఎవరో కార్మిక లోకం ప్రజలకు తెలియజేయాలన్నారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తామని సీఎం కేసీఆర్ అంటే.. కొందరు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని ఆరోపించారు. కోల్ ఇండియా కంటే సింగరేణిలోనే వేతనాలు అధికమని తెలిపారు. సింగరేణిలో ఉద్యోగాలను తగ్గించి.. ప్రైవేటీకరించాలని కుట్ర పన్నారని.. కానీ ఇవాళ దాన్ని మనం తిప్పికొట్టి కార్మికులందర్నీ కాపాడుకున్నామని కవిత చెప్పారు.

కాంగ్రెస్, బీజేపీలను మర్చిపోయారన్న కవిత
ఏడాది, రెండేళ్లు, మూడేళ్లకో రిటైరయ్యే వాళ్లందర్నీ చేరదీసి.. వాళ్ల పిల్లలందరికీ దాదాపు 18 వేల మందికి సింగరేణిలో ఉద్యోగాలిచ్చామని కవిత చెప్పారు. సింగరేణి సౌకర్యాల మాదిరిగా దేశమంతా ఉండాలని.. దేశంలోని బొగ్గు గని కార్మికులందర్నీ ఏకం చేయాలని కవిత పిలుపునిచ్చారు. బీజేపీ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి, రిజర్వేషన్లను ఎత్తివేసే ప్రయత్నాలు చేస్తోందని కవిత ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు మర్చిపోయారన్నారు కవిత. బీఆర్ఎస్ దూసుకెళ్తుందని వ్యాఖ్యానించారు.

రామప్ప ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు
అంతకుముందు ములుగు జిల్లాలో పర్యటించిన కవిత రామప్ప దేవాలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రామప్ప డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. దీని ద్వారా ఆలయ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి ములుగులోని గట్టమ్మ దేవాలయం, రామప్ప ఆలయాన్ని కవిత దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ములుగును జిల్లాగా ఏర్పాటు చేశారని, మెడికల్ కాలేజీని కూడా మంజూరు చేశారని చెప్పారు.

గండ్ర, మధుసూదనాచారి వర్గీయుల ఘర్షణ
ఇది ఇలావుండగా, భూపాలపల్లిలో తెలంగాణ బొగ్గు గని కార్మికుల సంఘం కొత్త భవనం ప్రారంభోత్సవంలో బీఆర్ఎస్‌లో వర్గ విబేధాలు బయటపడ్డాయి. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం భవనంలో శిలాఫలకంలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి పేరులేదని ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ లో వర్గ విభేదాలు సృష్టించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అనుచరులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది.












Click it and Unblock the Notifications