ఆయనపై పోటీ అంటే.. మైసమ్మ ముంగిట మేకపోతును కట్టేసినట్టే: ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. మంత్రి మల్లారెడ్డి తో కలిసి ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అద్భుతంగా పని చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ప్రశంసించారు.
ఆర్మూర్ నియోజకవర్గంలో జీవన్ రెడ్డి మీద ఎవరైనా పోటీ చేయాలనుకుంటే మైసమ్మ ముంగిట మేకపోతును కట్టేసినట్టేనని కవిత పేర్కొన్నారు. దేశంలో ఇప్పటి వరకు ఎవరూ చేయని మంచి పనులను సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని, అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గత ఎన్నికల్లో కంటే అధిక మెజారిటీతో వచ్చే ఎన్నికల్లో గెలుస్తారని విశ్వాసం ఉందన్నారు. ఆర్మూరులో జీవన్ రెడ్డిపై పోటీని మిగిలిన పార్టీల నాయకులు ఆశలు వదిలేసుకుంటే మంచిది అని కవిత హితవు పలికారు. గత పదేళ్ళలో దేశంలో ఎవరూ చేయని మంచి పనులు బీఆర్ఎస్ పార్టీ చేసి చూపించిందని కవిత పేర్కొన్నారు.
మరింత బాధ్యతగా పని చేద్దామని పిలుపునిచ్చిన కవిత ప్రజలకు మంచి చేయాలన్నదే ప్రధాన ఆలోచనగా పనిచేయాలన్నారు. దేశవ్యాప్తంగా బి ఆర్ ఎస్ పార్టీ విస్తరిస్తోందని పేర్కొన్న కవిత ప్రజలకు మంచి జరగాలన్న సదుద్దేశంతో పని చేస్తున్నాం కాబట్టే ప్రజలు బీఆర్ఎస్ ను ఆదరిస్తున్నారన్నారు. ఒకప్పుడు ఇదేం పార్టీ అని అవహేళన చేశారని ఇప్పుడు అదే గులాబీ పార్టీ ఇంటికి మూడు పథకాలను అందించే స్థాయికి ఎదిగింది అని కవిత పేర్కొన్నారు.
పదిమందికి సహాయం చేసామంటే ఆరోజు రాజకీయనాయకులకు ప్రశాంతంగా నిద్రపడుతుందని కవిత పేర్కొన్నారు. తెలంగాణా బాగు పడాలని అంతా కోరుకున్నామని, ఇప్పుడు తెలంగాణా ప్రగతిని చూస్తున్నామన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశారని, ఆ త్యాగాల ఫలితమే ఇప్పుడు అందిస్తున్న సంక్షేమ ఫలాలు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో తెలంగాణా ప్రజల సాగునీటి కష్టాలు తీరాయన్నారు.












Click it and Unblock the Notifications