బిటెక్ విద్యార్థి దారుణ హత్య: ప్రేయసి సోదరుల పనేనా?
వరంగల్: వరంగల్ జిల్లాలో జరిగిన బిటెక్ విద్యార్థి వినయ్ కుమార్ హత్య వెనక అతని ప్రేయసి సోదరులు ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్‌కు చెందిన ప్రియురాలి సోదరులు పథకం ప్రకారం హతమార్చారా లేదా స్నేహితుడు మధు ప్రమేయంతోనే ఈ సంఘటన జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వినయ్‌కుమార్ తల్లి దండ్రులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికే వరంగల్ చేరుకున్నారు. ప్రియురాలి సోదరులను, మృతుడి స్నేహితుడు మధును అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద వరంగల్ ఇంజనీరింగ్ విద్యా ర్థి చెలుమల్లి వినయ్ కుమార్ (20) హత్య మిస్టరీగా మారింది.
వరంగల్‌లో అదృశ్యమైన వినయ్‌కుమార్‌ను పెదకాకాని వద్ద యూకలిప్టస్ తోటలో హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. మృతదేహం వద్ద లభించిన ఫోన్‌లోని సిమ్ కార్డు ద్వారా పెదకాకాని సీఐ శేషారావు మృతుని తల్లి దండ్రులకు, బంధువులకు సమాచారం అందించారు. బుధవారం జీజీహెచ్‌లోని మార్చురీ వద్ద మృతదేహాన్ని పరిశీలించిన తల్లి దండ్రులు తమ కుమారుడిగానే గుర్తించారు.

వివరాలు ఇలా ఉన్నాయి - వరంగల్ జిల్లా ముగుల్‌గన్‌పుర్‌కు చెందిన చెలుమల్లి సంపత్ ఆర్‌ఎంపి డాక్టర్‌గా పని చేస్తుంటాడు. ఇద్దరి కుమారుల్లో రెండో వాడు వినయ్‌కుమార్ వరంగల్ నిట్ ఇంజనీరింగ్ కాలేజిలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. వరంగల్‌లో ఇంటర్ చదివే సమయంలో మధు అనే విద్యార్థితో పరిచయం ఏర్పడింది.
వీరి మధ్య స్నేహం పెరగడంతో మధు తనకు పరిచయం ఉన్న యువతిని వినయ్‌కుమార్‌కు పరిచయం చేశాడు. అయితే వినయ్, ఆ యువతి మధ్య స్నేహం బాగా పెరిగింది. ఇద్దరూ కలిసి తిరుగుతున్నారు. దీంతో యువతి సోదరులు గమనించి ఈ నెల రెండో తేదీన వరంగల్ రైల్వే స్టేషన్‌లో వారిని పట్టుకున్నారు. తండ్రి సంపత్‌ను పిలిపించారు. దీంతో తండ్రి కుమారుడిని గట్టిగా మందలించాడు.
కారులో తండ్రి ఇంటికి వెళ్ళగా ద్విచక్ర వాహనంపై బయలుదేరిన వినయ్‌కుమార్ ఇంటికి వెళ్లలేదు. స్నేహితుడి ఇంటికి వెళ్లి తన చేతికి ఉన్న ఉంగరం, బంగారపు గొలుసును ద్విచక్ర వాహనంలో పెట్టి తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. ఇంటికి రాకపోవడంతో వరంగల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అదృశ్యం కింద కేసు నమోదు చేశారు. రెండో తేదీన అదృశ్యమై 8వ తేదీన పెదకాకాని సమీపంలో దారుణ హత్యకు గురయ్యాడు.
హత్యకు సంబంధించిన అనవాళ్లు దొరకకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి నిప్పంటించారు. అయితే సంఘటనా స్థలంలో సెల్‌ఫోన్, వెండి మొలతాడు లభించింది. సెల్‌ఫోన్‌లోని సిమ్ కార్డు ఆధారంగా తల్లి దండ్రులకు సమాచారం ఇచ్చారు. మార్చురీలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించి తమ కుమారుడిగానే నిర్థారించుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications