నాగార్జున పిటిషన్: మంత్రి కొండా సురేఖకు మరో షాక్
మంత్రి కొండా సురేఖకు మరో షాక్ తగిలింది. ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖ (Konda Surekha)కు హైదరాబాద్ నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. నాగార్జున పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
కాగా, నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలో క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున పిటిషన్ వేశారు. ఈ క్రమంలో వాదనలు జరిగాయి. ఆ తర్వాత కొండా సురేఖపై నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. కొండా సురేఖకు సమన్లు జారీ చేసిన కోర్టు.. తదుపరి విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేసింది. డిసెంబర్ 12న జరిగే విచారణకు హాజరుకావాలని మంత్రి కొండా సురేఖను కోర్టు ఆదేశించింది.

సినీనటులు నాగచైతన్య, సమంత విడాకుల విషయంలో ఇటీవల మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నాంపల్లి కోర్టులో నాగార్జున పరువునష్టం దావా వేశారు. మాజీ మంత్రి కేటీఆర్‌పై విమర్శలు చేస్తున్న క్రమంలో నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
కాగా, దుబ్బాకలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేనేత కార్మికుల సమస్యలు చెప్పేందుకు తన మెడలో నూలు దండ వేస్తే. ఆ ఫొటో కింద నీచమైన కామెంట్లు పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ అప్పట్లో కంటతడి పెట్టుకున్నారు. బీఆర్ఎస్ పెద్దల నుంచి సురేఖ క్షమాపణలు ఆశించగా.. ఆమెవి దొంగ ఏడుపులు, పెడబొబ్బలు ఎందుకో అర్థం కావడం లేదు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో దొంగ ఏడుపులు నాకు అవసరం లేదు.. నీకు తల్లి లేదా? అని కేటీఆర్‌పై సురేఖ మండిపడ్డారు.
ఈ క్రమంలోనే నాగచైతన్య, సమంత దంపతుల విడాకులకు కేటీఆరే కారణమంటూ కొండా సురేఖ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసిందే కేటీఆర్ అంటూ ఆరోపించారు. ఆయన బాధకు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్లు చేసుకున్నారని అన్నారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు చాలా మంది హీరోయిన్లతో ఆడుకున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖపై అటు రాజకీయ, ఇటు సినీ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.












Click it and Unblock the Notifications