ప్రధాని మోడీని పెద్దన్న అంటే తప్పేంటి?: కేసీఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
బీఆర్ఎస్ నేతల విమర్శల నేపథ్యంలో.. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పెద్దన్న అంటే తప్పేముందని ప్రశ్నించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లాగా తాము మోడీకి చెవిలో ఏమీ చెప్పలేదంటూ చురకలంటించారు.
రాష్ట్రానికి కావాల్సిన విషయాలను మైక్‌లోనే చెప్పానన్నారు. మంగళవారం మీడియాతో సీఎం రేవంత్ చిట్‌చాట్‌గా మాట్లాడారు.
పదేళ్లలో కేసీఆర్ వందేళ్ల విధ్వంస చేశారని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని వంద రోజుల్లో సరిదిద్దే పనిలో ఉన్నామన్నారు రేవంత్. వంద రోజుల తమ పనితనంపై వచ్చే ఎన్నికల్లో తీర్పునివ్వండి అని అన్నారు. తమ పాలన మీద తమకు విశ్వాసం ఉందన్నారు. పారదర్శక పాలన అందిస్తామని చెప్పుకొచ్చారు.

కేసీఆర్‌కు ప్రజలు పొలిటికల్ పనిష్మెంట్ ఇచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిసి.. సమాచారాన్ని ధ్వంసం చేశారని.. దీనిపై లీగల్ గా చర్యలు ఉంటాయని సీఎం రేవంత్ హెచ్చరించారు. విచారణ లేకుండా ఎవరికీ శిక్ష వేయలేం కదా అన్నారు. మేడిగడ్డ రిపేర్లపై కేసీఆర్, హరీశ్ రావుల వాదనకు కంటెంట్ లేదని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
వారు చేసిన దొంగతనం కప్పిపుచ్చుకునేందుకు రిపేర్లు చేయాలని తమ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై రేవంత్ మండిపడ్డారు. మేడిగడ్డకు రిపేర్ చేయాలని నేషనల్ డ్యామ్స్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇస్తే రిపేర్లు చేస్తామన్నారు. కేసీఆర్ చదివింది కేవలం బీఏనే.. కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో పీజీ చేసినట్లు సమాచారం ఇచ్చారని రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు.
కేటీఆర్, కేసీఆర్, హరీశ్ రావులే మేడిగడ్డ దొంగలని.. ఈ దొంగల సలహాలు తీసుకుని రిపేర్లు చేయమంటారా? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్స్ సేఫ్టీ అథారిటీ నివేదికకు నాలుగు నెలల గుడువు అవసరమా? అని ప్రశ్నించిన రేవంత్.. బీజేపీ-బీఆర్ఎస్ సర్దుబాటు చేసుకోవడానికి నాలుగు నెలలు గడువిచ్చారా? నిలదీశారు. మోడీని అభివృద్ధి పనులు అడుగుతామన్న రేవంత్.. కానీ, మీలా ప్రేమని పంచమని అడగమన్నారు.
ఎల్ఆర్ఎస్‌పై బీఆర్ఎస్ నేతల విమర్శలకు కూడా రేవంత్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు ఇన్నాళ్లు గుమ్మి కింద పంది కొక్కుల్లా బలిసిపోయారని విమర్శించారు. రేపు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సిరిసిల్లలో కేటీఆర్ ఆమరణ దీక్ష చేయాలన్నారు.
తమ కుటుంబం నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయరని రేవంత్ చెప్పుకొచ్చారు. మోడీ సర్జికల్ స్ట్రైక్ పై రేవంత్ కౌంటర్ ఇస్తూ.. మా స్ట్రైక్ కూడా చూస్తారంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు, బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తమ మిత్రుడు కాదన్న రేవంత్.. ఆయనపై ఉన్న మబ్బులన్నీ తొలగిపోయాయన్నారు. తమ ప్రభుత్వం పడిపోతుందని పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని ప్రతిపక్షాలపై రేవంత్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications