మద్యం మత్తులో మహిళతో అసభ్య ప్రవర్తన: పోలీసు కానిస్టేబుల్ అరెస్ట్
హైదరాబాద్: మద్యం మత్తులో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీస్ కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హయత్‌నగర్ ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. చైతన్యపురి పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దేవేందర్ హయత్‌నగర్‌లోని భాగ్యలత కాలనీలో నివాసముంటున్నాడు.
సోమవారం అర్ధరాత్రి సమయంలో భాగ్యలత బస్టాప్ సమీపంలో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై మహిళ హయత్‌నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం ఉదయం నిందితుడిని అరెస్టు చేశారు.
డ్రగ్స్ ముఠా అరెస్ట్
హైదరాబాద్ నగరంలో మాదక ద్రవ్యాల(డ్రగ్స్) అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. మెడికల్ షాపు లను అడ్డగా చేసుకున్న డ్రగ్స్ ముఠా మాదక ద్రవ్యాల విక్రయాలను యధేచ్చగా జరుపుతోంది. డ్రగ్స్ అమ్మకాలపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు.

తనిఖీల్లో భాగంగా మంగళవారం పాతబస్తీలోని చాంద్రాయణగుట్టలో ఓ మెడికల్ షాపుపై దాడులు జరిపారు. మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న మెడికల్ షాపు యాజమాని, ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. ట్యాబ్ లెట్స్, టానిక్స్, ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
భర్తతో గొడవపడి నిప్పంటించుకున్న భార్య
ఇంటి అద్దె విషయంలో భర్తతో గొడవపడి క్షణికావేశానికి గురైన భార్య కిరోసిన్‌పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. శ్రీపురంకాలనీలోని ఖాదర్‌కు చెందిన ఇంట్లో ఐదేళ్లుగా గోవర్ధన్, భాగ్యమ్మ(28) అనే దంపతులు అద్దెకు ఉంటున్నారు. అద్దె అంతగా చెల్లించలేనందున మరోచోట ఉందామని గోవర్ధన్ అనటంతో భాగ్యమ్మ మొండికేసింది.
అయినప్పటికీ గోవర్ధన్ ఖాళీ చేయాల్సిందేనని పట్టుబట్టడంతో క్షణికావేశానికి గురైన భాగ్యమ్మ ఇంట్లో ఉన్న కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాణాపాయ స్థితిలో చికిత్సపొందుతున్న భాగ్యమ్మ వాంగ్మూలాన్ని రికార్డుచేసుకున్న పోలీసులు, కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications