నా ఇంటికి కూడా ఐటీ ఆఫీసర్లను పంపించారు, హోదాపై చిల్లర రాజకీయం: పవన్ ఆగ్రహం
Recommended Video

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిలు కేసులకు భయపడుతున్నారని మండిపడ్డారు.
తనపైకి ఐటీ అధికారులను పంపించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. థర్డ్ ఫ్రంట్ అధికారం కోసమే అని అందరూ అనుకుంటున్నారని చెప్పారు. థర్డ్ ఫ్రంట్ అని తాము చెబుతోంది అధికారం కోసం కాదని, రాజకీయాల్లో మార్పు కోసమని చెప్పారు.

జిగ్నేష్ మేవానీ లాంటి వారు కలుస్తారు
స్వతంత్రంగా వ్యవహరించడానికి థర్డ్ ఫ్రంట్ అవసరమని పవన్ కళ్యాణ్ చెప్పారు. థర్డ్ ఫ్రంట్‌లో దక్షిణాది నుంచి అన్ని రాష్ట్రాలు కలిసి రావాలని, కాంగ్రెస్, బీజేపీలను వ్యతిరేకించే పార్టీలు ముందుకు రావాలని అభిప్రాయపడ్డారు. దక్షిణాది నుంచే కాకుండా జిగ్నేష్ మేవాని వంటి వారు కూడా కలిసి వస్తారన్నారు.

నా పైకి ఐటీ అధికారులను పంపించారు
వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కేసులకు భయపడుతున్నాయని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. తనపైకి ఐటీ అధికారులను కూడా పంపించారని బాంబు పేల్చారు. తెలంగాణ ఉద్యమం తరహాలో ప్రత్యేక హోదా ఉద్యమం జరగాలని ముందుకు సాగాలన్నారు.

చిల్లరగా ప్రవర్తన
ప్రత్యేక హోదాపై బాధ్యతతో వ్యవహరించాల్సిన పార్టీలు చిల్లరగా ప్రవర్తిస్తున్నాయని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా పార్టీలు ఉద్యమిస్తున్నాయన్నారు.

హోదా కోసం
కాగా, ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు ఢిల్లీ వీధుల్లో పోరాడుతున్న విషయం తెలిసిందే. అయితే వారు రాజకీయ లబ్ధి కోసం తప్ప చిత్తశుద్ధితో పోరాడటం లేదని పవన్‌తో పాటు పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పింది.

హోదా కోసం జేఏసీ ఏర్పాటు చేయాలి
ఈ నేపథ్యంలో పవన్ మాట్లాడారు. ప్రత్యేక హోదా ఉద్యమం కోసం ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ)ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. జిల్లాస్థాయి నేతలు అందరూ పార్టీలకు అతీతంగా కలిసి రావాలని సూచించారు.

బీజేపీ ఇలా, టీడీపీ అలా
కేంద్రం నిధులు ఇవ్వకపోవడం వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదని చంద్రబాబు ప్రభుత్వం అంటోందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇచ్చిన వాటికి లెక్కలు చెప్పనందుకే నిధులు నిలిపేశామని కేంద్రం అంటోందని చెప్పారు. ఏది నిజమో తెలియాల్సి ఉందన్నారు.












Click it and Unblock the Notifications