మనకు ఒకేసారి రెండు వందేభారత్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్ ..!!
తెలుగు రాష్ట్రాల నుంచి మరో రెండు వందేభారత్ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఏపీ, తెలంగాణ లో వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. ప్రయాణీకుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు రైల్వే శాఖ మరో రెండు వందేభారత్ సర్వీసులను అందుబాటులోకి తెస్తోంది. ఈ నెల 15న ప్రధాని మోదీ ఈ రైళ్లను ప్రారంభించనున్నారు. వచ్చ నెలలో వందేభారత్ మరో సర్వీసుతో పాటుగా వందేభారత్ స్లీపర్ సైతం తెలుగు రాష్ట్రాలకు కేటాయించనున్నారు.
రెండు రైళ్లు
ఈ నెల 15న ప్రధాని మోదీ దేశ వ్యాప్తంగా 15 వందేభారత్ నూతన సర్వీసులను ప్రారంభించనున్నారు. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి రెండు ప్రారంభం కానున్నాయి. సికింద్రాబాద్- నాగ్‌పూర్ మధ్య ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నడవనుంది. సాధారణ ప్రయాణం కంటే 45 నిమిషాల తక్కువ సమయంలో గమ్యస్థానం చేరుకోవచ్చు. సికింద్రాబాద్- నాగ్‌పూర్ మధ్య 578 కిలో మీటర్ల దూరం ఉంటుంది. సుమారు 7 గంటల 15 నిమిషాల్లో కవర్ చేస్తుంది. సికింద్రాబాద్ నుంచి నిత్యం నాగపూర్ కు పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తున్నారు.

రూట్ ఖరారు
ఈ రైలు ఉదయం 7.20 గంటలకు నాగ్ పూర్ నుండి బయలు దేరి.. అదే రోజు మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అదే విధంగా.. మధ్యాహ్నం 1 గంటకు సికింద్రాబాద్ లో బయలు దేరి రాత్రి 8.20 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. కాజీపేట్, రామగుండం, బల్లార్ష, చంద్రాపూర్, సేవాగ్రామ్ స్టేషన్లలో ఈ రైలుకు హాల్టుగా నిర్దారించారు. త్వరలోనే సికింద్రాబాద్ - పూణే మధ్య వందేభారత్ స్లీపర్ సైతం అందుబాటులోకి వస్తుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. తొలి విడత లో ప్రకటించిన వందేభారత్ స్లీపర్ రైళ్లలో ఈ రూటుకు కేటాయించారు.
అధికారుల కసరత్తు
దుర్గ్-విశాఖపట్నం(20829) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 6 గంటలకు దుర్గ్‌లో బయల్దేరి మధ్యాహ్నం 1.55 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం-దుర్గ్(20830) వందేభారత్ రైలు మధ్యాహ్నం 2.50 గంటలకు బయల్దేరి రాత్రి 10.50 గంటలకు దుర్గ్‌కు వెళ్తుందని తెలుస్తోంది. మరోవైపు విజయవాడ నుంచి బెంగళూరు మధ్య వందేభారత్ రైలు నడిపే అంశంపై కేంద్ర రైల్వేశాఖ సమీక్ష జరుపుతోందని సమాచారం. దీంతో, రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి మరిన్ని వందేభారత్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయం జరిగింది.












Click it and Unblock the Notifications