అమిత్ షా, జీ కిషన్ రెడ్డికి ఊరట
Amit Shah and G Kishan Reddy: హైదరాబాద్‌లో నమోదైన కేసుల నుంచి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డికి ఊరట లభించింది. గతంలో నమోదు చేసిన కేసుల జాబితాలో నుంచి పోలీసులు వారిద్దరి పేర్లను తొలగించారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో అమిత్ షా, జీ కిషన్ రెడ్డిపై ఈ కేసులు నమోదయ్యాయి. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు ఆరోపణలను ఎదుర్కొన్నారు వారిద్దరూ అప్పట్లో. కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పాతబస్తీలోని మొఘల‌్‌పురా పోలీసులు కేసు పెట్టారు.

వారితో పాటు బీజేపీకే చెందిన గోషా మహల్ శాసన సభ్యుడు టీ రాజా సింగ్, హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థి మాధవీలతపైనా ఈ కేసులు నమోదయ్యాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలను ఉల్లంఘించినట్లు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. దీనితో మొఘల్‌పురా పోలీసులు వారందరిపైనా ఐపీసీలోని సెక్షన్ 188 కింద బుక్ చేశారు.
తాజాగా అమిత్ షా, జీ కిషన్ రెడ్డి పేర్లను ఈ జాబితా నుంచి తొలగించారు. ఎన్నికల అనంతరం వారిద్దరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేబినెట్‌లో కీలక శాఖలను పర్యవేక్షిస్తోన్న క్రమంలో విచారణ నుంచి వారికి మినహాయింపు ఇచ్చారు. జాబితా నుంచి పేర్లను డిలేట్ చేశారు.
మాధవీలత, టీ రాజా సింగ్.. ఎంసీసీ ఉల్లంఘన కేసులో విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. 8వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు.. దీనిపై విచారణ జరుపుతోంది. అమిత్ షా, కిషన్ రెడ్డి మినహా మిగిలిన ఇద్దరు మాధవీలత, టీ రాజా సింగ్ విచారణను ఎదుర్కొంటారు.
ఆ ఎన్నికల్లో మాధవీలత ఓటమి పాలయ్యారు. తన సమీప ప్రత్యర్థి, అఖిల భారత మజ్లిస్-ఇ- ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ చేతిలో మట్టికరిచారు. మూడున్నర లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఒవైసీ గెలిచారు. ఇంత భారీ మెజారిటీ రావడం ఒవైసీకి ఇదే తొలిసారి కూడా.












Click it and Unblock the Notifications