నిర్మల్‌లో బీజేపీ నేతలపై లాఠీఛార్జ్, డీకే అరుణ అరెస్ట్: బీఆర్ఎస్ సర్కారుపై కిషన్ రెడ్డి ఫైర్
హైదరాబాద్: నిర్మల్‌లో బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. నిర్మల్‌ల కొత్త మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆందోళనకారులపై లాఠీఛార్జీ చేసి చెదరగొట్టారు. దీంతో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు.
నిర్మల్‌లో వందల ఎకరాల భూమిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన బంధువులకు కట్టబెట్టారని ఆరోపించారు. ఆ భూములకు అనుకూలంగానే ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రూపొందించారని విమర్శించారు. రైతుల భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

మాస్టర్ ప్లాన్‌లోని లొసుగులను నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. శాంతియుతంగా నిరసన తెలిపిన బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. నిర్మల్‌కు వెళ్తున్న బీజేపీ నాయకులపై అరెస్ట్ చేసి.. ఎక్కడికి తరలించారో కూడా తెలయదని కిషన్ రెడ్డి అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు అనేక అక్రమాలు చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
నిర్మల్ వెళుతున్న బీజేపీ నేత డీకే అరుణను అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం భూములు అమ్మి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని మండిపడ్డారు. ఎల్బీనగర్‌లో గిరిజన మహిళపై దాడి చేయడం దారుణమన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. నాలుగు నెలల్లో తెలంగాణ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు కిషన్ రెడ్డి.
నిర్మల్‌లో బీజేపీ నేతల ఆందోళన
నిర్మల్ పట్టణ కొత్త బృహత్ ప్రణాళికను రద్దు అంశంపై బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఐదోరోజుకు చేరుకుంది. దీక్ష చేస్తున్న మహేశ్వర్ రెడ్డి ఆరోగ్యం క్షీణించినా.. రాష్ట్ర ప్రభుత్వం స్పందిచపోవడం సరికాదని నేతలు మండిపడ్డారు. నిర్మల్‌లో బీజేపీ శ్రేణులు చేపట్టిన రాస్తారోకో స్వల్ప ఉద్రిక్తతలకు దారితీసింది. రోడ్డుపై బైఠాయించి.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం బీజేపీ కార్యకర్తలు మంత్రి ఇంద్రకరణ్ ఇంటి ముట్టడికి యత్నించారు. దీంతో వీరిని అడ్డుకున్న పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అనంతరం పలువురు బీజేపీ నాయకలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మహేశ్వర్ రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు వెళుతున్న బీజేపీ నేత డీకే అరుణను అరెస్ట్ చేసి నిజామాబాద్‌కు తరలించారు పోలీసులు.












Click it and Unblock the Notifications