స్మితా సబర్వాల్‌కు షాకిచ్చిన పోలీసులు!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యువత అభివృద్ధి, సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ (Smita Sabharwal)కు పోలీసులు నోటీసులు అందించారు. సోషల్ మీడియాలో కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల అడవి ధ్వంసానికి సంబంధించిన ఓ ఏఐ సహాయంతో రూపొందించిన ఫొటోను షేర్ చేయడం ఇందుకు కారణం కావడం గమనార్హం.
ఈ ఫొటో మార్చి 31న హాయ్ హైదరాబాద్ (HiHyderabad)అనే ఎక్స్ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ఈ పొటో మష్రూమ్ రాక్ వద్ద బుల్‌డోజర్లు, వాటిని చూస్తున్న నెమలి, జింక లాంటి జంతువులతో జిబ్లి శైలిలో రూపొందించినట్లు ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) పరిధిలో ఉన్న కంచ గచ్చిబౌలి ప్రాంతాన్ని చిత్రంలో చూపించారు. ఆ ఫొటోను స్మితా సబర్వాల్ షేర్ చేశారు.

నోటీసుల విషయంపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మహ్మద్ హబీబుల్లా ఖాన్ మాట్లాడుతూ.. బీఎన్ఎస్‌లోని సెక్షన్ 179 ప్రకారం స్మిత్ సబర్వాల్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అయితే, నోటీసులో పేర్కొన్న విషయాలను ఇప్పుడే బయటపెట్టలేమని సదరు అధికారి స్పష్టం చేశారు.
కాగా, బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 179 ప్రకారం కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి.. సంబంధిత వ్యక్తులను స్టేట్‌మెంట్ ఇవ్వాలంటూ పీఎస్‌కు హాజరయ్యేలా పిలిచే అధికారం కలిగి ఉంటారు. ఆ నిబంధనల ఆధారంగానే స్మితా సబర్వాల్‌కు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రజా చైతన్యాన్ని కలిగించే విభాగంలో ఉన్న ఒక అధికారికి నోటీసు రావడం చర్చనీయాంశంగా మారింది.
#Ghibli Story On #Hyderabad Today! #SaveHCU #SaveHCUBioDiversity#SaveHyderabadBioDiversity 🏞️ pic.twitter.com/ozbmxvSZ7D
— Hi Hyderabad (@HiHyderabad) March 31, 2025
గతంలో కూడా స్మితా సబర్వాల్ సోషల్ మీడియా పోస్టులతో చిక్కుల్లో పడ్డారు. కాగా, తాజా అంశంలో మాత్రం ఆమెకు పలువురి నుంచి మద్దతు లభిస్తోంది. ఫొటో షేర్ చేసినందుకు కూడా నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. బావ ప్రకటనా స్వేచ్ఛ అంటే ఇదేనా? అని నిలదీస్తున్నారు. దీంతో తనకు మద్దతుగా నిలిచిన వారి పోస్టులను స్మితా సబర్వాల్ తన ఎక్స్ ఖాతాలో రీట్వీట్ చేస్తున్నారు.
'మొదటిసారిగా, పోలీసులు రీట్వీట్ చేసినందుకు ఒక ఐఏఎస్ అధికారిపై కేసు నమోదు చేశారు!. స్మితా సభర్వాల్, ఐఏఎస్, యువజనాభివృద్ధి, పర్యాటక & సంస్కృతి ప్రధాన కార్యదర్శికి తెలంగాణ పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. నేరం: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని బుద్ధిహీనంగా బుల్డోజ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె AI- రూపొందించిన గిబ్లి చిత్రాన్ని రీట్వీట్ చేశారు. ఈరోజు బిఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 179 కింద గచ్చిబౌలి పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తున్న 100 ఎకరాల కంచ గచ్చిబౌలి అడవిని బుల్డోజ్ చేయడంపై సుప్రీంకోర్టు ఈరోజు కొన్ని తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది' అని ఓ జర్నలిస్టు చేసిన పోస్టును స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications