రమేష్ మొదటి భార్యకు ఫ్లాట్: అందుకే ప్రత్యూషకు చిత్రహింసలు
హైదరాబాద్: ప్రత్యూష అనే 19 ఏళ్ల యువతిని తండ్రి రమేష్, సవతి తల్లి చామండేశ్వరి అలియాస్ శ్యామల చిత్రహింసలు పెట్టడానికి గల కారణం వెలుగు చూసింది. హైదరాబాదులోని సనత్‌నగర్‌లో గల ఫ్లాట్‌ను సొంతం చేసుకోవడానికే వారు ప్రత్యూషను హింసకు గురి చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారని అంటున్నారు.
ప్రత్యూష తల్లి సరళ 2010లో మరణించింది. ప్రత్యూష ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వొకేషనల్ మల్టీపర్పస్ వర్కర్స్ కోర్సు చదువుతుండగా ఆ సంఘటన జరిగింది. సరళ మరణం తర్వాత రమేష్ చాముండేశ్వరి అలియాస్ శ్యామలను పెళ్లి చేసుకున్నాడు. సరళ పేరు మీద సనత్‌నగర్‌లో ఫ్లాట్ ఉంది. దానిపై చాముండేశ్వరి కన్నేసినట్లు చెబుతున్నారు.

సవతి తల్లి వేధింపుల నుంచి ప్రత్యూష అనే యువతికి బాలల హక్కుల సంఘం విముక్తి కల్పించింది. ఈ వారం రోజుల క్రితం సవతి తల్లి, తండ్రి చిత్రహింసల నుంచి ప్రత్యూష బయటపడింది. ప్రత్యూష తండ్రి రమేష్‌ను ఎల్‌బీనగర్ పోలీసులు బుధవారం రాత్రి బోయిన్‌పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. గతంలో న్యూమరాలజిస్టుగా పని చేసినప్పుడు పరిచయమైన వ్యక్తి వద్ద రమేష్ ఆశ్రయం పొందాడు.
ఆ ఫ్లాట్ కోసమే ప్రత్యూషను అనాథాశ్రమం నుంచి ఇంటికి తీసుకుని వెళ్లడానికి రమేష్ తీవ్రంగా ప్రయత్నించినట్లు అర్థమవుతోంది. ఇంటికి రావాల్సిందిగా రమేష్ చేసిన విజ్ఞప్తిని ప్రత్యూష మూడు సార్లు తిరస్కరించింది. చివరికి నాలుగో సారి అతను చెప్పే మాటలు నమ్మి ఇంట్లో అడుగు పెట్టింది. కొద్ది రోజుల పాటు ఏ ఇబ్బంది లేకుండా ప్రత్యూష ఆ ఇంట్లో ఉంది. ఆ తర్వాత ప్రత్యూషను సవతి తల్లి హింస పెడుతూ వచ్చింది.












Click it and Unblock the Notifications