తెలంగాణలో రెండు రోజులు వర్షాలు, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ప్రభావం కారణంగా ఏప్రిల్ 7,8 తేదీల్లో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. శని, ఆదివారాల్లో మొత్తం పొడి వాతావరణమే ఉండనుందని పేర్కొంది.
ఏప్రిల్ నెల 7న జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఏప్రిల్ నెల 8న జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆ తర్వాత రానున్న మూడు రోజుల్లో రెండు నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. కాగా, గడిచిన 24 గంటల్లో వరంగల్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్క తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసినట్లుగా టీజీడీపీఎస్ పేర్కొంది.
కాగా, గురువారం హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఈ వర్షాలతో ఎండతీవ్రత నుంచి హైదరాబాద్ నగర ప్రజలకు ఉపశమనం లభించినప్పటికీ.. జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. ఆరబోసిన ధన్యాలు, పంట తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ వ్యాప్తంగా కొంత ఎండవేడిమి తగ్గినట్లయింది.












Click it and Unblock the Notifications