Raja Singh: మా హిందూ పండగ హోలీ ఎలా జరుపుకోవాలో పోలీసులు చెప్తారా..?
Raja Singh: తెలంగాణలో హోలీ నిబంధనలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో నిజాం పాలనలా కాంగ్రెస్ పాలన సాగుతోందని ఆయన విమర్శించారు. హిందువుల పండగలకు ఎందుకు ఆంక్షలు పెడుతున్నారని ప్రశ్నించారు. హోలీ కోసం పోలీసులు జారీ చేసిన ఆదేశంపై రాజాసింగ్ మండిపడ్డారు. హోలీ 12 గంటల వరకే జరుపుకోవాలన్న నిబంధన ఎందుకని ప్రశ్నలు గుప్పించారు. 12 గంటల వరకే చేసుకోవాలని.. గుమిగూడొద్దని పోలీసులు చెబుతున్నారన్నారు. హిందూ పండగ ఎలా చేసుకోవాలో పోలీసులు చెబుతారా అంటూ ఎద్దేవా చేశారు.
హోలీ సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుపుకుంటారు కాబట్టి ముస్లింలు రోడ్లపైకి రాకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి ఉండాలన్నారు. ప్రజలు తమ ఇళ్ల వద్ద నమాజ్ చేసుకోవాలని పోలీసులు కోరాలన్నారు. ప్రభుత్వం తన ముస్లిం అనుకూల వైఖరిని ప్రదర్శిస్తూ హిందువులు హోలీ పండగ జరుపుకోకుండా నిరోధిస్తోందని విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ పోలీసులు జారీ చేసిన ఆదేశాలను "నిజామియా ఫర్మానా", తుగ్లక్ ఫర్మానా అంటూ రాజాసింగ్ అభివర్ణించారు.

రంజాన్ సందర్భంగా పోలీసులు ఎందుకు అలాంటి ఆదేశాలు జారీ చేయరని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి అని.. సీఎం రేవంత్ తాను తొమ్మిదో నిజాం అని నిరూపించుకోవాలనుకుంటున్నారని రాజా సింగ్ అన్నారు. కాంగ్రెస్ అంటేనే హిందూ పండగల వ్యతిరేకి అని.. హిందువుల జోలికి వస్తే రేవంత్ తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ కు పడుతుందని ఘాటు విమర్శలు చేశారు.
సొంతపార్టీపై కూడా రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీలోని పాత సామాను బయటకు పోవాలంటూ రాజాసింగ్ పేర్కొన్నారు. బీజేపీ అధిష్ఠానం దీనిపై ఫోకస్ పెట్టాలన్నారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ముఖ్యమంత్రిని సీక్రెట్ గా కలుస్తారని.. అలాంటి వాళ్లను బయటకు పంపితేనే బీజేపీకి మంచి రోజులు వస్తాయన్నారు.












Click it and Unblock the Notifications