నిజమైన హిందువు ఎవరూ రామమందిరం ప్రారంభోత్సవానికి వెళ్లరు- రేవంత్ రెడ్డి
Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ గడువు సమీపించింది. ఈ నెల 22వ తేదీన ఈ ఆలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. సోమవారం నుంచే పండగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 4,000 వేలమంది ప్రముఖులు హాజరు కానున్నారు.
ఇప్పటికే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్.. ఆహ్వానపత్రికలను అందించింది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ నటీనటులు, సెలెబ్రిటీలకు ఆహ్వానం అందింది. అయోధ్యలో ప్రతి ఇంటికీ రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలను పంపించింది.

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటిస్తోన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా అక్కడ ఏర్పాటైన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటోన్నారు.
ఇండియా టుడే ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సహా పలు ప్రశ్నలకు సూటిగా సమాధానాలను ఇచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్, తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాల గురించి వివరించారు.
అయోధ్య ఆలయంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని బీజేపీ కార్యక్రమంగా అభివర్ణించారు రేవంత్ రెడ్డి. రామాలయం ప్రతి ఒక్క హిందువుకూ చెందుతుందని పేర్కొన్నారు. దీన్ని బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని వ్యాఖ్యానించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమానికి వెళ్లదలచుకోలేదని అన్నారు.

అయోధ్య రామమందిరం నిర్మాణం కూడా పూర్తి కాలేదని, అసంపూర్తిగా ఉన్నప్పుడే ప్రారంభించడానికి గల కారణాలు అందరికీ తెలిసిందేనని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రామ మందిరాన్ని, హిందూయిజాన్ని అడ్డుగా పెట్టుకుని బీజేపీ మత రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు.
అసంపూర్తిగా ఉన్న ఆలయంలో శ్రీరాముడికి ప్రాణ ప్రతిష్ఠను చేసే కార్యక్రమానికి నిజమైన హిందువు ఎవరూ కూడా వెళ్లబోరని అన్నారు. నిర్మాణ పూర్తయిన తరువాత తాను కూడా రామమందిరాన్ని సందర్శిస్తానని రేవంత్ రెడ్డి ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. భద్రాచలంలోని శ్రీ సీతారామారంజనేయ స్వామివారి ఆలయం అయినా.. అయోధ్యలోని రామమందిరం అయినా తనకు ఒక్కటేనని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications