గోకుల్ చాట్ పేలుళ్ల నిందితులకు రిమాండ్ పొడిగింపు
హైదరాబాద్: గోకుల్‌చాట్, లుంబిని పార్కులో జంట బాంబు పేలుళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్టయిన నిందితులకు నాంపల్లి కోర్టు రిమాండ్ పొడిగించింది. డిసెంబర్ 30 వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్టు జడ్జి తీర్పునిచ్చారు. భారీ బందోబస్తు మధ్య గోకుల్‌చాట్ బాంబు పేలుళ్ల కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు నాంపల్లి కోర్టుకు తరలించారు.
ముగ్గురు నిందితులను చంచల్‌గూడ జైలు నుంచి కోర్టుకు తీసుకు వచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. 2007 ఆగస్టు 25న గోకుల్ చాట్, లుంబిని పార్క్ జంట పేలుళ్ల ఘటనలో 42 మంది మృతిచెందారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆరోజు సాయంత్రం 7.45 నిమిషాలకు గోకుల్‌చాట్‌తోపాటు లుంబిని పార్క్‌లో ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు.

అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
ఖమ్మం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి బస్సులో తరలిస్తున్న 45 కేజీల గంజాయిని గురువారం ఉదయం పాల్వంచలో పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
గుడుంబా నిర్మూలనకు మొహల్లా కమిటీ
నగరంలోని చాంద్రాయణగుట్ట పరిధిలోని జహంగీరాబాద్, వాదే పరాన్ బస్తీలలో గుడుంబాను నిర్మూలించేందుకు పోలీసులు మొహల్లా కమిటీను ఏర్పాటుచేశారు. చాంద్రాయణగుట్ట పోలీసులు బుధవారం రాత్రి ఈ రెండు బస్తీలలో సమావేశం నిర్వహించారు.
గుడుంబా విక్రయాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. గుడుంబా నిర్మూలన కోసం స్థానికులు సహకరించాలని అధికారులు సూచించారు. దీనికి ప్రజలు అంగీకరించడంతో మొహల్లా కమిటీని ఏర్పాటు చేశారు.
బస్తీలో నేరాల నివారణకు సహకరిస్తామని ఈ సందర్భంగా ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. అసాంఘిక కార్యకలాపాలపై తమకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. మొహల్లా కమిటీకి అనుగుణంగా పోలీస్‌స్టేషన్ తరపున ఒక ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లతో ఒక టీం ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications