నా నోరు కట్టేయలేదు, నన్ను వాడుకోలేదు: బాబు-కెసిఆర్ మైత్రిపై రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ఇరువురు సీఎంల (చంద్రబాబు - కెసిఆర్) ఫ్రెండ్‌షిప్ తన చేతులు కట్టేయలేదని, తాను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిడిపి - బిజెపి గెలుపు ఖాయమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సోమవారం ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు.
హైదరాబాదులో శాంతిభద్రతలు బాగా క్షీణించాయన్నారు. స్నేక్ గ్యాంగ్‌లను, చైన్ స్నాచింగ్‌లను, పట్టపగలు దొంగతనాలను నిరోధించలేకపోయిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాల మీద విమర్శలు కొనసాగుతాయన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ను గద్దె దించడమే లక్ష్యమని చెప్పారు.
కొంతమంది నాయకులు పార్టీ నుంచి వెళ్లిపోయినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిడిపి పునర్వైభవం కోసం పాకులాడటం లేదని, ఇప్పటికి తమ పార్టీకి నగరంలో పట్టు ఉందన్నారు. 2008లో తెరాస ఓడిపోయినప్పుడే ఆ పార్టీ పని అయిపోయిందని భావించామా అన్నారు.
కుటుంబ శుభకార్యాలయం ఉండటడం వల్ల కొంతకాలం పార్టీకి దూరంగా ఉన్నానని చెప్పారు. ప్రజలకు టిఆర్ఎస్ పాలన నుంచి విముక్తం కలిగిస్తానని చెప్పారు. ఓటుకు నోటు కేసు విషయంలో బెయిల్ పైన ఉన్నానని, కోర్టు షరతుల మేరకు దాని గురించి మాట్లాడనని చెప్పారు.
నా చేయి కట్టిపడేయలేదు
చంద్రబాబు - కెసిఆర్ మిత్రుత్వం తెరాసపై రేవంత్ రెడ్డి చేయి కట్టేసినట్లయిందనే వాదనలు వినిపిస్తున్నాయని అడగ్గా... అలాంటిదేమీ లేదని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కెసిఆర్ ఒకటి రెండుసార్లు కలిశారని, అలాంటప్పుడు మంత్రి కెటిఆర్ ప్రధాని పైన, బిజెపి పైన విమర్శలు చేయడం లేదా అని ప్రశ్నించారు.
అలాగే తాను ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తానని చెప్పారు. చంద్రబాబు తెలంగాణకు పూర్తిగా దూరమయ్యారా అని ప్రశ్నిస్తే... ఇంకా చేయి పట్టి నడిపించలేరని, ఏపీ ముఖ్యమంత్రి అయినందున ఆయన అక్కడ బిజీగా ఉంటారని, ఇక్కడ మేం పోరాడాల్సి ఉంటుందని చెప్పారు. పార్టీని ఎలా నడిపించారో మాకు నేర్పించారన్నారు.
కొత్త రాష్ట్రం కాబట్టి ఆ పరిస్థితులకు అనుగుణంగా చంద్రబాబు ఏపీలో ఉంటున్నారన్నారు. నూటికి నూరు శాతం గ్రేటర్ ఎన్నికల్లో మేం గెలుస్తామన్నారు. ఎవరు ఆహ్వానించినా, ఎన్ని ఒత్తిడులు ఉన్నా తాను పార్టీ మారేది లేదని చెప్పారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా టిడిపిలోనే ఉంటానని చెప్పరు.

మాకే ఓటు వేస్తారు
పార్టీలో సీనియర్లు, జూనియర్లు లేరని, అందరం ఒకటే మాట ఉన్నామన్నారు. గ్రేటర్‌లోని సీమాంధ్రులకు కెసిఆర్ పైన ఎక్కువ ఆగ్రహం ఉందని చెప్పారు. కెసిఆర్ ఉద్యమంలో సమయంలో దారుణంగా మాట్లాడారని అభిప్రాయపడ్డారు. మాకు ఓటు వేసేందుకు గ్రేటర్ ప్రజలు ఆసక్తితో ఉన్నారన్నారు.
తనను బలిపశువును చేశారని కొందరు భావించవచ్చునని, అది వారికి తన పైన ఉన్న అభిమానమని, కానీ ఏం జరిగిందనే విషయం వారికి తెలియదని, మేం చెప్పలేదని, వారు అభిమానంతో ఇలా భావిస్తుండవచ్చునని అన్నారు. తనను వాడుకున్నారనే వాదన సరికాదన్నారు.
ఏ రోజు అయితే కెసిఆర్ కుర్చీ మీద నుంచి దిగుతారో అప్పుడు రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకుంటారన్నారు. కెసిఆర్ కుటుంబం వల్ల తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతోందన్నారు. తనకు కుర్చీ మీద మమకారం ఉంటే ఇప్పుడే తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన అధైర్యపడాల్సింది లేదన్నారు. చంద్రబాబు తమకు గైడ్‌గా ఉంటారని చెప్పారు. ఆయన మాకు సూచనలు ఇస్తారన్నారు. మా ప్రాంతంలో మమ్మల్ని ముఖ్య నేతలుగా ఎదగమని చంద్రబాబు సూచించారన్నారు.
తాను ఎదగడానికి 'రెడ్డి' అనేది కూడా కారణం కావొచ్చన్నారు. తెలుగుదేశం పార్టీలో నీవు దెబ్బతిన్నావు కాబట్టి.. ఆ పార్టీ నుంచి బయటకు రావాలని మీ సామాజిక వర్గం నుంచి ఒత్తిడి వస్తున్నట్లుగా తెలుస్తోందని చెప్పగా... అలాంటిదేమీ లేదని అభిప్రాయపడ్డారు.
ఒకప్పుడు నేను సామాన్య కార్యకర్తనని చెప్పారు. గోడల పైన రాతలు కూడా రాశానని చెప్పారు. కార్యకర్తల నుంచే నాయకులు పుట్టుకు వస్తారని చెప్పారు. తనను ఎన్ని పార్టీలు ఆహ్వానించిన టిడిపిలోనే ఉంటానని చెప్పారు. తాను పార్టీ మారే ప్రసక్తి లేదన్నారు.












Click it and Unblock the Notifications