ముందుగానే, మాట్లాడకుండా జైలుకి రేవంత్! అందుకే ఆలింగనంతో సరి
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో మధ్యంతర బెయిల్ పొందిన రేవంత్ రెడ్డి రెండు గంటల ముందుగానే జైలుకు బయలుదేరారు. ఆయనకు న్యాయస్థానం పన్నెండుగంటల పాటు బెయిల్ ఇచ్చింది. ఆయనకు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు అనుమతి ఉంది.
చర్లపల్లి జైలు కొంత దూరంగా ఉన్నప్పటికీ ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా ఆయన ముందుగానే బయలేదేరి ఉండవచ్చు. అయితే, మరీ రెండు గంటలు ముందు కాకపోయినా, కాస్త ఆలస్యమైనా చేరుకునేవారు. కానీ ఆయన చాలాముందుగా బయలుదేరారు.
ఉదయం ఇంటికి చేరుకున్న రేవంత్ రెడ్డి, అటు నుండి ఎన్ కన్వెన్షన్‌కు చేరుకున్నారు. అక్కడ నిశ్చితార్థం అనంతరం తిరిగి మూడున్నర గంటలకు ఇంటికి వచ్చారు. గంటన్నర పాటు కుటుంబ సభ్యులతో గడిపారు. నాలుగు గంటలకు స్వచ్ఛందంగా బయటకు వచ్చి, తనను తరలించేందుకు సిద్ధంగా ఉన్న వాహనం ఎక్కారు.

వెంటనే ఎస్కార్ట్ సిబ్బంది ఆయనతో పాటు బయలుదేరారు. రేవంత్ రెడ్డి న్యాయస్థానం నిబంధనలు తూచ తప్పకుండా పాటించారు. ఎవరితోను మాట్లాడలేదు. ఉదయం ఇంటికి వెళ్లే సమయంలో చర్లపల్లి జైలు వద్ద అభిమానులు హడావుడి చేసినప్పటికీ ఆయన వాహనం దిగలేదు.
నిశ్చితార్థం సమయంలో చంద్రబాబు ఆయన పక్కనే కూర్చున్నారు. కానీ ఏం మాట్లాడుకోలేదు. అయితే, భవిష్యత్తులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటప్పుడు ఏసీబీ నుండి అభ్యంతరాలు వ్యక్తం కాకుండా పూర్తిగా నిబంధనలు పాటించారని చెప్పవచ్చు. పార్టీ నేతలు, కార్యకర్తలు, బంధువులు మాట్లాడేందుకు యత్నించినా రేవంత్ పలకరింతలు, ఆలింగనాలతో సరిపుచ్చారు.

తప్పు అంగీకరించాలి: ఈటెల
చంద్రబాబుకు ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉంటే తన తప్పును అంగీకరించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య గొడవగా చిత్రీకరించవద్దన్నారు. ఇది ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు. చంద్రబాబును చరిత్ర క్షమించదన్నారు.
జేఎంఎం ముడుపుల వ్యవహారంలో ఎలా శిక్ష పడిందో తెలుసునని చెప్పారు. తప్పు చేస్తే ప్రధానికి ఐనా శిక్ష తప్పదన్నారు. బీహార్ విభజనను వ్యతిరేకించిన లాలుకు పట్టిన గతే చంద్రబాబుకు పడుతుందన్నారు.
హైదరాబాద్‌లో ఉంటూ అధికార పార్టీని టార్గెట్ చేస్తారా? అంటూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా నిలదీశారు. తెరాస ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని, అది సాధ్యమయ్యే పనికాదన్నారు. ఓటుకు నోటు కేసులో రికార్డయిన ఆడియో వాయిస్ చంద్రబాబుది కాదా? చెప్పాలన్నారు.
తప్పు ఎవరు చేసినా సరే ఒప్పుకోక తప్పదన్నారు. ఎమ్మెల్యేకు డబ్బులిస్తూ ఏసీబీకి రెండ్ హ్యాండెడ్‌గా దొరికిపోయావు, లొంగిపోక తప్పదన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, అరెస్టు చేస్తే ప్రభుత్వం ఉండదని ఎవరిని హెచ్చరిస్తున్నారని, కానీ చంద్రబాబు హెచ్చరించే స్థాయిలో లేరన్నారు.












Click it and Unblock the Notifications