ఇప్పటికీ వాళ్లు టిడిపి ఎమ్మెల్యేలే, అసెంబ్లీలో మాకు 15 స్థానాలు: రేవంత్ రెడ్డి ట్విస్ట్
తాము ఇచ్చిన ఫిర్యాదుల పైన స్పీకర్ చర్యలు తీసుకునే వరకు తమ పార్టీ నుంచి గెలిచి అధికార తెరాసలో చేరిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు తమ పార్టీకి చెందిన వారే అవుతారని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ అన్నారు.
హైదరాబాద్: తాము ఇచ్చిన ఫిర్యాదుల పైన స్పీకర్ చర్యలు తీసుకునే వరకు తమ పార్టీ నుంచి గెలిచి అధికార తెరాసలో చేరిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు తమ పార్టీకి చెందిన వారే అవుతారని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి గురువారం అన్నారు.
అసెంబ్లీలో ఆ లెక్క ప్రకారం తమకు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. శాసన సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారన,ి సభలో మాట్లాడే అవకాశం తమకు ఇవ్వాలన్నారు.

ఎమ్మెల్యేలు ఇతర పార్టీలో చేరిన అంశంపై హైకోర్టులో విచారణ జరిగిందని, ఈ నెల 21వ తేదీతో స్పీకర్‌కు ఇచ్చిన గడువు ముగుస్తుందన్నారు. ఆ లోగా పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అప్పటి వరకు టిడిపి ఎమ్మెల్యేల సంఖ్య 15 అన్నారు.
కాగా, టిడిపి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకయ వీరయ్యలు గురువారం స్పీకర్ మధుసూదనా చారిని కలిశారు. ఫిరాయించిన పన్నెండు మంది ఎమ్మెల్యేలపై తక్షణమే వేటు వేయాలన్నారు. ఈ నెల 21వ తేదీతో హైకోర్టు ఇచ్చిన గడువు ముగుస్తుందని చెప్పారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర రావు వంటి 12 మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications