టిటిడిపికి షాక్: ఎమ్మెల్యే ఇంట్లో రూ.18 కోట్లు స్వాధీనం, కర్నాటకలో ఆస్తులు
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది! ఆరేడు నెలల క్రితం తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా, మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పైన ఐటీ దాడులు నిర్వహించింది.
కర్ణాటకలోని రాయచూరులో రాజేందర్ రెడ్డికి నవోదయ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేరిట విద్యాలయం ఉంది. ఆయనకు రాయచూరులోనూ సొంతిల్లు ఉంది. బుధవారం రాజేందర్ రెడ్డికి చెందిన కళాశాలతో పాటు ఇంటిపైనా కర్ణాటక ఐటీ శాఖ అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు.
ఈ సోదాల్లో పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుతో పాటు పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ.18 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఐటీ అధికారులో ఏకకాలంలో నివాసం, కార్యాలయాలు, విద్యాలయంలో సోదాలు నిర్వహించారు.

ఆ కళాశాలకు సంబంధించి బ్యాంకులో డిపాజిట్ చేయవలసిన సొమ్మును కార్యాలయంలో లాకర్లో పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. బుధవారం ఉదయం నుంచే ఈ సోదాలు కొనసాగినా, రాత్రి వరకూ ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. మీడియా ప్రతినిధులను లోనికి అనుమతించలేదు.
గత సార్వత్రిక ఎన్నికల్లో (2014) రాజేందర్ రెడ్డి తన ఆస్తులను రూ.29 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇతనికి కర్నాటకలోని రాయచూర్‌లో చాలా ఆస్తులు ఉన్నట్లుగా తెలుస్తోంది. రాజేందర్ రెడ్డి రాయచూర్‌లోనే ఓ కళాశాలలో ఎంఫార్మా పూర్తి చేశారు.












Click it and Unblock the Notifications