సికింద్రాబాద్ నుంచి కర్ణాటకకు ప్రత్యేక రైళ్లు: ఏపీలో హాల్ట్ స్టేషన్లు
Special Trains: శ్రావణమాసం రాకతో పండగ సీజన్ ఆరంభమైంది. ఈ సీజన్ లో రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్‌లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు.
ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు- పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు.

ఇప్పుడు తాజాగా సికింద్రాబాద్, చర్లపల్లి నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైళ్లన్నీ కూడా శుక్రవారం అంటే ఈ నెల 8వ తేదీన పట్టాలెక్కబోతోన్నాయి. ఈ నెల చివరి వారం వరకూ రాకపోకలు సాగించనున్నాయి. వీటికి సంబంధించిన టైమ్ టేబుల్ విడుదల అయింది.
సికింద్రాబాద్- మైసూరు ప్రత్యేక రైళ్లు..
- 8వ తేదీ నుంచి ఈ నెల 29 వరకు ప్రతి శుక్ర, సోమ వారాల్లో రాత్రి 10:10 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరే నంబర్ 07033 ప్రత్యేక రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 4 గంటలకు మైసూరుకు చేరుకుంటుంది.
- 9వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ప్రతి శని, మంగళవారాల్లో సాయంత్రం 5:20 నిమిషాలకు మైసూరు నుంచి బయలుదేరే నంబర్ 07034 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది.
- బేంగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, సేడం, యాద్గిర్, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యలహంక, బెంగళూరు కంటోన్మెంట్, కేఎస్ఆర్ బెంగళూరు, కెంగేరి, మండ్య మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.
చర్లపల్లి- కాకినాడ ప్రత్యేక రైలు.. (సింగిల్ ట్రిప్)
- ఈ నెల 8వ తేదీన శుక్రవారం సాయంత్రం 7:30 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరే నంబర్ 07031 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడ టౌన్ కు చేరుకుంటుంది.
- ఈ నెల 10వ తేదీన ఆదివారం రాత్రి 8:10 నిమిషాలకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరే నంబర్ 07032 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 8:30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఇది సింగిల్ ట్రిప్ మాత్రమే.
- నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.












Click it and Unblock the Notifications