తెలంగాణలో ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ: కటాఫ్ తేదీ ఇదే
తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఏక కాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని పండగ చేయడమే కాంగ్రెస్ విధానమని వ్యాఖ్యానించారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్.. కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడారు. 2022 మే 6న వరంగల్లో తమ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్‌లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన గ్యారంటీని అమలు చేయడానికి మంత్రివర్గం సమావేశం నిర్వహించామన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రూ. 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

ఆగస్టు 15 నాటికి రుణమాఫీ పూర్తి చేస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని, సోనియా మాట ఇస్తే శిలాశాసనమేనన్నారు రేవంత్. అదే తరహాలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారని, అందుకే మంత్రివర్గం రుణమాఫీ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.
2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఉన్న రుణాలన్నీ ఏక కాలంలో మాఫీ చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు. ఇందుకోసం రూ.31 వేల కోట్లు అవసరమని అంచనా వేసినట్లు చెప్పారు. రుణమాఫీతో 47 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా రైతుభరోసా అమలుపై మంత్రివర్గం ఉపసంఘం వేశామని తెలిపారు.
జులై 15 లోపు మంత్రివర్గం ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని, దాని ఆధారంగా రైతుభరోసా విధివిధానాలు ఖరారు చేస్తామని సీఎం తెలిపారు. ప్రభుత్వ పాలనాపరమైన నిర్ణయాలను ప్రకటించేందుకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబు నియమించినట్లు వెల్లడించారు. ఆ ఇరువురు ఇచ్చే సమాచారమే అధికారికమని, దీంతో రాజకీయాలకు సంబంధం లేదని తెలిపారు.
విధివిధానాల, అర్హుల ఎంపిక తదితర అంశాలపై సమాలోచనలు చేసిన ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా అమలుచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. త్వరలోనే రుణమాఫీపై జీవో ఇస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications