బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య
నిర్మల్: బాసర ఆర్జీయూకేటీలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి బుచ్చుక అరవింద్(17) మంగళవారం హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఐఐటీ క్యాంపస్‌లో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. పోలీసులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటికి వెళ్లిన విద్యార్థి పరీక్షల నిమిత్తం ఏప్రిల్ 12న తిరిగి యూనివర్సిటీకి వచ్చాడు.
అయితే, హాజరుశాతం తక్కువగా ఉందని అధికారులు అతడ్ని పరీక్షకు అనుమతించలేదు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి హాజరు శాతం తక్కువగా ఉందని.. ఇంటికి తీసుకెళ్లాలని చెప్పారు. వారు రాకపోవడంతో విద్యార్థి హాస్టల్ లోనే ఉన్నాడు. తోటి విద్యార్థులు పరీక్షకు వెళ్లిన కొద్ది సేపటికే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఆ తర్వాత అక్కడికి వచ్చిన ఇతర విద్యార్థులు గమనించి వెంటనే అధికారులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
బుచ్చుక అరవింద్ స్వస్థలం సిద్దిపేట జిల్లా తొగుట మండలం బండారుపల్లి. అరవింద్ మృతితో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా, ఫిబ్రవరి 22న పీయూసీ ఐ ఇయర్ విద్యార్థిని తెనుగు శిరీష (17) హాస్టల్‌లో ఉరి వేసుకుని కనిపించగా, నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన రమాటి ప్రవీణ్ కుమార్ (20) నవంబర్ 26న హాస్టల్‌లో విగత జీవిగా కనిపించాడు.












Click it and Unblock the Notifications