మునుగోడు ఫలితాల్లో కొత్త ట్విస్ట్ - బీజేపీ నేతల సీరియస్..!!
రాజకీయ ఉత్కంఠ పెంచుతున్న మునుగోడు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. కౌంటింగ్ ప్రారంభమైన తరువాత ఇప్పటి వరకు నాలుగు రౌండ్ల ఫలితాలు వెను వెంటనే వెల్లడించారు. అయిదో రౌండ్ ఫలితం ఇంకా ప్రకటించలేదు. దీని పైన బీజేపీ నేతలు సందేహాలు - ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తీరు అనుమానాస్పదంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ లీడ్ వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను అప్ డేట్ చేయటం లేదని మండిపడ్డారు.
బీజేపీ లీడ్ వచ్చినప్పటికీ ఫలితాలను వెల్లడించ లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. మొదటి, రెండు రౌండ్ల తరువాత మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను అప్ డేట్ చేసేందుకు జాప్యానికి కారణాలేమిటో సీఈవో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేసారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేనంత ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని నిలదీసారు. ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. ఇదే సమయంలో నాలుగో రౌండ్ ఫలితాల పైన రీకౌంటింగ్ కోరే ఆలోచనలో రాజగోపాల్ ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసారు.

రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎప్పటికప్పుడు ఎందుకు ఫలితాలు వెల్లడించడం లేదని సీఈవోను ప్రశ్నించారు. కేంద్ర మంత్రి ఫోన్ చేసిన 10 నిమిషాల్లోనే 4 రౌండ్ల ఫలితాలను అప్ లోడ్ చసారు. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో సీఈవో తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగో రౌండ్ పూర్తయ్య సరికి టీఆర్ఎస్ 714 ఓట్ల ఆధిక్యతలో ఉంది. తొలి , నాలుగో రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యత రాగా.. రెండు - మూడో రౌండ్లలో బీజేపీ ఆధిక్యత సాధించింది. కీలకమైన చౌటుప్పల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. అయిదో రౌండ్ లో సంస్థాన్ నారాయణ్ పూర్ మండలానికి సంబంధించిన ఓట్లు లెక్కిస్తున్నారు. నాలుగో రౌండ్ వరకు మొత్తంగా పోలయిన ఓట్లలో 63,351 ఓట్ల లెక్కింపు పూర్తయింది.












Click it and Unblock the Notifications