HCU: చెట్ల నరికివేతపై సుప్రీం సీరియస్: తెలంగాణ హైకోర్టు, సీఎస్‌కు కీలక ఆదేశాలు
Save HCU: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో చెట్ల నరికివేత వ్యవహారం మరో మలుపు తిరిగింది. దేశ అత్యున్నత న్యాయస్థానం రంగంలోకి దిగింది. ఇందులో జోక్యం చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి కీలక ఆదేశాలను జారీ చేసింది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన 400 ఎకరాల అటవీ భూమిలో కొద్దిరోజులుగా చెట్ల నరికివేత విస్తృతంగా కొనసాగుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఫలితంగా అక్కడ తలదాచుకుంటోన్న వణ్యప్రాణులు, పక్షులు ఆశ్రయాన్ని కోల్పోయాయంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

హెచ్‌సీయూ విద్యార్థులు కొన్ని రోజులుగా నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. తరగతులను బహిష్కరించారు. చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టారు. అర్ధరాత్రిపూట కూడా వారి ఆందోళన కొనసాగిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ పరిణామాల మధ్య సుప్రీంకోర్టు రంగంలోకి దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 400 ఎకరాల అటవీ ప్రాంతంలో చెట్ల నరికివేత అంశం సుప్రీంకోర్టు సమక్షానికి వచ్చింది. దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. మధ్యంతర నివేదికను అందజేయాలంటూ తెలంగాణ హైకోర్టను ఆదేశించింది.
ఈ మధ్యాహ్నం 3:30 గంటలలోపు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) 400 ఎకరాల అటవీ ప్రాంతాన్ని సందర్శించాలని నివేదికను అందజేయాలని ఆదేశించింది. అలాగే తాము తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో చెట్ల నరికివేతకు అనుమతి లేదంటూ తెలంగాణ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.
తదుపరి విచారణను ఈ మధ్యాహ్నం 3:45 నిమిషాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ లోగా తెలంగాణ హైకోర్టు తన మధ్యంతర నివేదికను సుప్రీంకోర్టుకు అందజేయాల్సి ఉంటుంది. అలాగే- హైకోర్టులో ఈ విషయం విచారణలో ఉన్నందున పనుల నిలుపుదలపై స్టే ఇవ్వలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications