అమిత్ షా గ్రీన్ సిగ్నల్, చంద్రబాబుకు షాక్!: టిడిపితో బిజెపి కటీఫ్
వరంగల్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అసంతృప్తిగానే తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసిన బిజెపి.. తాజాగా వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుకు షాకిచ్చింది. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విడిగా పోటీ చేస్తున్నాయి.
వరంగల్లో మొత్తం 58 డివిజన్లు ఉన్నాయి. టిడిపి 48 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. బిజెపి 43చోట్ల తమ అభ్యర్థులను బరిలో దింపింది. మిగిలిన 10 స్థానాల్లో ఆరింటిలో తమ అభ్యర్థులుంటారని, మిగతా నాలుగు చోట్ల ఇండిపెండెంట్లకు మద్దతిస్తామని టిడిపి చెబుతోంది.
మిగతా పదిహేను డివిజన్లలో ఇతరులకు మద్దతిస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. దీంతో ఈ రెండు పార్టీలూ కలసి పోరుకు దిగడం లేదని భావించవచ్చు. ఈ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసిపోగా పలు పార్టీలు ఇంకా అభ్యర్థుల పేర్లనే ఖరారు చేయలేదు.

టిఆర్ఎస్ మరో పది డివిజన్లలో అభ్యర్థుల పేర్లు ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెస్ ఒక్క పేరు కూడా ప్రకటించలేదు. ఆశావహులు మాత్రం నామినేషన్లు వేసి ఎదురు చూస్తున్నారు. గత నెలలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటమికి మీరు కారణమంటే, కాదు మీరే కారణమని టిడిపి, బిజెపి పరస్పరం విమర్శలు సంధించుకున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిడిపి 90కి పైగా, బిజెపి 60కి పైగా చోట్లపోటీ చేశాయి. మొత్తం 150 స్థానాల్లో.. ఇందులో కొన్నిచోట్ల స్నేహపూర్వక పోటీలు ఉన్నాయి. అయితే, ఎన్నికల ఫలితాల్లో ఈ పార్టీలు బోల్తా పడ్డాయి. బిజెపి 4 స్థానాలు గెలుచుకోగా, టిడిపి అయితే మరీ ఘోరంగా ఒక్క స్థానంలోనే గెలిచింది.
ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచి టిడిపి పొత్తుపై అసంతృప్తితో ఉన్న తెలంగాణ బిజెపి నేతలు మరోసారి అధిష్టానం వద్ద తెలుగుదేశం పార్టీతో తెలంగాణలో పొత్తు వద్దని ఆవేదనను వెళ్లగక్కారు. ఈ నేపథ్యంలో జాతీయ అధ్యక్షులు అమిత్ షా వారికి ఓకే చెప్పారని తెలుస్తోంది. ఈ కారణంగా బిజెపి ఒంటరిగా రంగంలోకి దిగిందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications