టీఆర్ఎస్‌లో చేరితే డబ్బు, బెదిరింపులు, హరీష్ కాల్ డేటా తీయాలి: వివేక్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి తమ పార్టీలో చేరాలని, అలాగైతే నగదు ఇస్తామని, చేరకుంటే భౌతిక దాడులు సైతం తప్పవని తెరాస నాయకుల నుండి హెచ్చరింపులు వస్తున్నాయని టీడీపీ ఎమ్మెల్యేలు వివేక్, రాజేందర్ రెడ్డిలు ఏసీబీకి బుధవారం రాత్రి ఫిర్యాదు చేశారు.
వారు ఐదుపేజీల వినతి పత్రం ఇచ్చారు. అధికార పార్టీ తమ నేతలను ఎలా ఇబ్బంది పెడుతుందో పేర్కొన్నారు. గత ఆగస్టు నుంచి మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు తెరాసలో చేరాలని తమ పైన ఒత్తిడి తెస్తున్నారని, తొలుత డబ్బు ఆశ చూపారని, తెరాసలో చేరితే అన్నీ తామే చూసుకుంటామని చెప్పారని అ్నారు.
పదవులు ఇస్తామని చెప్పారన్నారు. గత ఆగస్టు 15న హరీష్, కేటీఆర్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై మాట్లాడతామని పిలిచారని, ఓ ప్రయివేటు కార్యాలయానికి పిలిచారని, అది ఎక్కడుందో కూడా తాను చెప్పగలనని ఎమ్మెల్యే వివేక్ చెప్పారు.

పార్టీలో చేరితే తనకు నగదుతో పాటు కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని చెప్పారన్నారు. తాను తిరస్కరించడంతో బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిలిపివేశారని ఆరోపించారు.
గత నెల 30, 31 తేదీల్లో టీఆర్ఎస్ నేత గంప గోవర్ధన్ టీడీపీ ఎమ్మెల్య సండ్ర వెంకట వీరయ్యను కలిసి తెరాసలో చేరాలని ఒత్తిడి తెచ్చారన్నారు. టీడీపీ నుంచి తెరాసలో చేరిన తర్వాత మంచిరెడ్డి కిషన్ రెడ్డి వందసార్లు రాజేందర్ రెడ్డికి ఫోన్ చేశారని చెప్పారు.
ఇప్పటికీ గుర్తు తెలియని ఫోన్ నెంబర్ల నుండి ఫోన్లు చేస్తూ బుజ్జగించడంతో పాటు బెదిరిస్తున్నారని చెప్పారు. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యేకు రూ. 3 కోట్లు ఆఫర్ ఇచ్చినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారని వైరా డీఎస్పీ గత ఫిబ్రవరి 20న గుత్తేదారుడు అజీజ్, ఒక విలేకరి సమక్షంలో చెప్పారని గుర్తు చేశారు.

హరీష్ రావు కాల్ డేటా తీస్తే అసలు విషయం బయటకు వస్తుందన్నారు. మిషన్ కాకతీయ పేరుతో జరుగుతున్న అక్రమాలు బయటపడితే హరీష్ రావు జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. కేసీఆర్ నిరంకుశ విధానాలతో తెలంగాణలో పని చేయడానికి అధికారులు భయపడుతున్నారన్నారు.
కేసులు ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటాయోనని సెలవులకు వెళ్తున్నారన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో స్టీఫెన్ సన్ కీలక వ్యక్తి అని, అతనిని తెరాస దేశం దాటించే ప్రయత్నాలు చేస్తోందని, అతని పైన రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications