తెలంగాణ ఎన్నికల ఫలితాలు : దేశం దృష్టి తెలంగాణాపైనే .. నరాలు తెగే ఉత్కంఠ!!
ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ ఓటు, సీటు చాలా కీలకమైనవి. ఇది ప్రతీ ఒక్కరూ అంగీకరించాల్సిన విషయం. ఇక ఈ క్రమంలో తెలంగాణా రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరిగిన ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పటికీ తెలంగాణా రాష్ట్రంపైనే జాతీయ నాయకుల ఫోకస్ ప్రధానంగా నెలకొంది.
త్యాగాల తెలంగాణలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన సాగింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ప్రజల తీర్పుపై ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతుంది. ఎవరెన్ని చెప్పినా, ఎన్ని మ్యానిఫెస్టోలు ప్రకటించినా, ఇబ్బంది ముబ్బడిగా డబ్బులు పంచినా ఓటర్లు మాత్రం సైలెంట్ గా తమ తీర్పును ఈవీఎం లలో భద్రపరిచారు.

నేడు జరుగుతున్న కౌంటింగ్ లో అభ్యర్థుల ముఖాల్లో నెత్తురు చుక్క లేదంటే పరిస్థితి అర్ధం అవుతుంది, అసలు ఓటర్లు ఎవరిని ఆదరించారు? ఓటరు తీర్పు ఎటు ఉంది? తాము గెలుస్తున్నామా? లేదా? అన్న ఆందోళన ప్రతీ అభ్యర్థి ముఖంలోనూ, పార్టీ శ్రేణులలోనూ వ్యక్తం అవుతుంది.
నరాలు తెగిపోయే టెన్షన్ ప్రతీ ఒక్కరిలో కొనసాగుతుంది. ఉత్కంఠతో ఫలితాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్ ప్రకారం మాకే మెజార్టీ అంటే మాకే అంటూ బిఆర్ఎస్, కాంగ్రెస్ చెపుతుంటే హంగ్ వస్తుందని బిజెపి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను బిజెపి చీల్చి బిఆర్ఎస్ గెలుస్తుందని ఊహాగానాలు, చర్చలు జోరుగా సాగినా, ఓటర్ల తీర్పు ఈసారి చాలా వైవిధ్య భరితంగా ఉంటుందని తాజా ట్రెండ్ ను బట్టి అర్ధం అవుతుంది.
పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోయింది. నోట్ల కట్టలతో జరిగిన ఎన్నికల్లో ఓట్లకు డబ్బు పంచిన అభ్యర్థుల్లో కౌంటింగ్ గుబులు కొనసాగుతుంది. పోరాడి గెలిచినా కూడా స్వంత పార్టీ అభ్యర్థులపైనే నమ్మకం లేని రాజకీయాలు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇక గెలిచే అభ్యర్థులను బంధించే వ్యూహాలు, ఎన్నికల ఫలితాలు రాకముందే అభ్యర్థులను క్యాంపులకు తరలించే రాజకీయాలు కూడా ఉత్కంఠకు కారణంగా మారాయి. మొత్తంగా ప్రజలు కేసీఆర్ నాయకత్వానికి జై కొట్టారా? లేకా మార్పు కోరుకున్నారా? అనేది మరికాసేపట్లో తెలియనుంది.












Click it and Unblock the Notifications