నాడు భరతుడు చేసిందే.. నేను చేశా: తేల్చేసిన బండి
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్.. ఒక్కసారిగా వివాదాలకు కేంద్రబిందువు అయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ విమర్శల సునామీలో చిక్కుకున్నారు. కుప్పలు తెప్పలుగా ఆయనపై ట్రోల్స్ వచ్చి పడుతోన్నాయి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రత్యక్షంగా గుజరాతీ నాయకుల కాళ్ల వద్దకు పెట్టారంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపణలు గుప్పిస్తోన్నారు. ఘాటు వ్యాఖ్యలతో చెలరేగుతోన్నారు.
Recommended Video

ఆ వీడియోపై..
దీనికంతటికీ కారణం- కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ఆలయం నుంచి బయటికి వచ్చిన అనంతరం ఆయనకు చెప్పులను అందించడమే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇదొక అస్త్రంలా దొరికింది. ఈ వీడియో ఆధారంగా బండి సంజయ్‌పై విమర్శల దాడి చేస్తోన్నారు.

బండి సంజయ్ ఎదురుదాడి..
దీనిపై ఆయన స్పందించారు. ఎదురు దాడికి దిగారు. ఢిల్లీ లిక్కర్ మాఫియాతో లింక్ పెట్టారు. ఢిల్లీ లిక్కర్ మాఫియాలో వలలో పడి కొట్టుకుంటున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, ఆయన కుటుంబ సభ్యుల రహస్యాలు బయట పడకుండా ఉండటానకే తనపై టీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తోన్నారని ఆరోపించారు. లిక్కర్ మాఫియా నుంచి బయటపడటానికి కేసీఆర్ కుటుంబ సభ్యులు తంటాలు పడుతున్నారని అన్నారు.

డైవర్షన్ పాలిటిక్స్..
దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోన్నారని ధ్వజమెత్తారు. దీన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అవసరం ఉంటే కాళ్లు మొక్కడం, లేదంటే అవే కాళ్లను పట్టి వెనక్కి లాగడం కేసీఆర్ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్యగా అభివర్ణించారు. కుటుంబంలో పెద్దలకు చెప్పులు అందించడం భారతీయ సంప్రదాయమని, దాన్ని పాటించడం తమకు అలవాటని బండి సంజయ్ స్పష్టం చేశారు.

గురుతుల్యుడు..
తమ పార్టీ కుటుంబ పెద్ద, గురుతుల్యుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు.. వయస్సులో చిన్నవాడినైన తాను చెప్పులను అందించడం గులాంగిరి అవుతుందా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ సాష్టాంగ దండ ప్రణామం చేసినపుడు పశ్చిమ బెంగాల్, తమిళనాడులోని పార్టీలకు గులాంగిరీ చేశారా? అంటూ నిలదీశారు. ఇపుడు తాను గురుతుల్యుడైన అమిత్ షాకు పాదరక్షలు అందిస్తే గుజరాత్ గులామ్ అయినట్టా? అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు.

ప్రొఫెసర్ జయశంకర్.. కొండా లక్ష్మణ్ బాపూజీని..
కేసీఆర్‌లాగా అవసరాన్ని బట్టి పొర్లు దండాలు పెట్టడం తమ రక్తంలోనే లేదని బండి సంజయ్ తేల్చి చెప్పారు. దివంగత ప్రొఫెసర్ జయశంకర్,, కొండా లక్ష్మణ్ బాపూజీని ఘోరంగా అవమానించిన కేసీఆర్‌కు గౌరవం విలువ ఏం తెలుస్తుందని ధ్వజమెత్తారు. కుటుంబ పెద్దకు చెప్పులు అందించిన తనను గులాం అని వెక్కిరించే టీఆర్ఎస్ నాయకుల కుసంస్కారం చూసి జనం నవ్వుకుంటున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

రోజూ తన్నుకుంటారు..
అధికారం కోసం రోజూ కేసీఆర్ ఇంట్లో ఆయన కుటుంబ సభ్యులు రోజూ తన్నుకుంటోన్నారని, అలాంటి వారికి- పెద్దలకు చెప్పులు అందించడంలోని సంస్కారం ఏం అర్థం అవుతుందని చెప్పారు. రామ - భరతుల వారసత్వాన్ని తాము తలకెత్తుకున్నామని వ్యాఖ్యానించారు. అరణ్యవాసంలో ఉన్న శ్రీరామచంద్రుడి చెప్పులను భరతుడు తలపై మోసిన ఉదంతాన్ని ఆయన గుర్తు చేశారు. తండ్రిని బంధించి, అన్నను చంపి అధికారం పొందిన ఔరంగజేబు వారసుల పక్కన తిరిగే వారికి తమ సంస్కృతి ఏం అర్థమవుతుందని అన్నారు.

గౌరవంతో పాదరక్షలు..
మేం పాద రక్షలు మాత్రమే గౌరవంతో అందిస్తామని బండి సంజయ్ వివరణ ఇచ్చారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల్లా అవసరం తీరాక పాదాలు పట్టి లాగేసే అలవాటు తమకు లేదని, తాము గులాంలు కాదని పేర్కొన్నారు. కేసీఆర్‌లా మజ్లిస్‌కు సలాం కొట్టే రజాకార్ల వారసులం అసలే కాదని అన్నారు. భారత్ మాతా కీ జై.. అంటూ తన సుదీర్ఘమైన ట్విట్టర్ పోస్టులను ముగించారు.












Click it and Unblock the Notifications