తెలంగాణ మహిళలకు భారీ శుభవార్త.. వారికి 4 ఎకరాలు ఇవ్వనున్న ప్రభుత్వం..!
రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలోని మహిళలను అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేశారు. ఆ తర్వాత రూ. 500 కే గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించారు. అలాగే కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం అని గతంలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం.. మహిళల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. మహిళామణులే లక్ష్యంగా ఇప్పటికే పలు పథకాలు ప్రారంభించింది. తాజాగా వారికి 4 ఎకరాల భూములు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం మహిళా సంఘాలకు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళలకు ఆర్థిక స్వావలంబన, సాధికారతను ప్రోత్సహించే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నూతన విధానంతో మహిళలు ఆర్థికంగా ఎదగడమే కాకుండా.. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి పెంచడానికి కూడా ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 4,000 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. అయితే ఇందులో 1,000 మెగావాట్లు వరకు మహిళా సంఘాల ద్వారా ఉత్పత్తి చేయించనుంది ప్రభుత్వం. ఈ పథకం మహిళలకు ఆర్థిక స్వావలంబనను, సాధికారతను ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించినట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా ఒక్కో మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే దాదాపు రూ.3 కోట్లు ఖర్చు అవుతుంది. ఇందులో 10 శాతం మహిళా సంఘాలు భరించనున్నాయి. మిగిలిన 90 శాతం బ్యాంకుల ద్వారా రుణాల రూపంలో ఇస్తారని ప్రభుత్వం తెలిపింది. మహిళా సంఘాలు రుణాల చెల్లింపులో 99 శాతం వరకు గుడ్ ట్రాక్ రికార్డు ఉన్నట్లు సమాచారం.

మరోవైపు రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ సందర్బంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు తెలిపింది. ఇవి ఈ నెల 11 తేదీ వరకు నడుస్తాయని ఆర్టీసీ పేర్కొంది. అయితే ఈ స్పెషల్ బస్సుల్లో 50 శాతం ఛార్జీలు పెంచినట్లు తెలంగాణ ఆర్టీసీ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications