తెలంగాణ కులగణన దేశానికే రోల్ మోడల్ కావాలి: సీఎం రేవంత్ దిశానిర్దేశం
తెలంగాణను కుల గణనలో దేశానికే రోల్ మోడల్‌గా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కులగణనపై గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కుల గణన ప్రక్రియపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టి తీరుతామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
కుల గణనపై సమన్వయం చేసుకునేందుకు 33 జిల్లాలకు 33 మంది ప్రత్యేక అబ్జర్వర్లను నియమించాలని రేవంత్ సూచించారు. బాధ్యతగా పనిచేయాలని, కష్టానికి తగిన ఫలితం తప్పకుండా ఉంటుందన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట అమలు చేసే క్రమంలో ఎవరు అభ్యంతరకరంగా వ్యవహరించినా పార్టీ క్షమించదని సీఎం రేవంత్ హెచ్చరించారు.

నవంబర్ 31లోగా ప్రక్రియ పూర్తి చేసి భవిష్యత్తు యుద్ధానికి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు రేవంత్ పిలుపునిచ్చారు. తెలంగాణ నుంచి ప్రధాని నరేంద్ర మోడీపై యుద్ధం ప్రకటించాల్సి ఉందని చెప్పుకొచ్చారు. కులగణన ఎక్స్‌రే మాత్రమే కాదని అది మెగా హెల్త్ చెకప్ లాంటిదని సీఎం రేవంత్ అన్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని సామాజిక న్యాయం ప్రకారం పంచడమే కాంగ్రెస్ విధానమని తెలిపారు.
భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో మన తెలంగాణను మోడల్‌గా పరిగణలోకి తీసుకునేలా డాక్యుమెంట్ ను కేంద్రానికి పంపుతామని సీఎం రేవంత్ చెప్పారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నది బీసీ కులగణన కాదు.. సమగ్ర కులగణన అని చెప్పుకొచ్చారు.
తెలంగాణలో కుల గణనకు తేదీ ఖరారు
దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపట్టనున్నారు. తెలంగాణలో నవంబర్ 6 నుంచి కులగణన ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఆ రోజే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించాలని రేవంత్ ప్రభుత్యం యోచిస్తోంది. ఈమేరకు గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. కులగణన తర్వాత ఏయే సంక్షేమ కార్యక్రమాలకు ఎంత నిధులు కేటాయించాలో తెలిసే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని మంత్రులు తెలిపారు. త్వరలో అన్ని జిల్లాల్లో కులగణనపై సమావేశాలు ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వారిని ఆదుకోవడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. రాహుల్ గాంధీ హామీ మేరకు కులగణన చేస్తున్నామన్నారు. సర్వేతో అందరి సామాజిక, ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయన్నారు. భవిష్యత్‌లో దేశమంతా తెలంగాణను అనుసరిస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు.












Click it and Unblock the Notifications