తెలంగాణలో ఒక్కరోజే లక్ష కొత్త రేషన్ కార్డులు- ముహూర్తం ఖరార్
Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం- కొత్త రేషన్ కార్డులను జారీ చేసే దిశగా నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారందరికీ శుభవార్త వినిపించింది. ఒకే రోజున లక్ష కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనుంది. దీనికి ముహూర్తం కూడా ఖరారు చేసింది.
కొత్త రేషన్ కార్డులను జారీ చేయడానికి ఉద్దేశించిన విధి విధానాలు, మార్గదర్శకాలను రేవంత్ సర్కార్ ఇదివరకే విడుదల చేసిన విషయం తెలిసిందే. రేషన్ కార్డులపై చాలాకాలంగా అపరిష్కృతంగా ఉంటూ వస్తోన్న విజ్ఞప్తులను పరిష్కరించే దిశగా ముందడుగు వేసింది తెలంగాణ ప్రభుత్వం. సంక్రాంతి పండగను పురస్కరించుకుని దీన్ని ప్రభుత్వం విడుదల చేసింది.

కుల గణన సర్వే ఆధారంగా తయారు చేసిన రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి జిల్లా కలెక్టర్లు/గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిఫనర్‌కు పంపిస్తారు. మండల స్థాయిలో ఎంపీడీఓ/ పట్టణ స్థాయిలో మున్సిపల్ కమిషనర్‌కు ఈ జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంటుంది.
జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ)/ జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు. ముసాయిదా జాబితాను గ్రామ సభ, వార్డు సభల్లో ప్రదర్శిస్తారు. అందులో పొందుపరిచిన వివరాలను చదివి వినిపిస్తారు. దీనిపై చర్చించిన తరువాత ఆమోదిస్తారు.
గ్రామ లేదా వార్డు సభల్లో ఆమోదం పొందిన లబ్దిదారుల అర్హత జాబితాను మండలం/మున్సిపల్ స్థాయిలో ఇచ్చిన లాగిన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్/జీహెచ్ఎంసీ కమిషనర్ లాగిన్‌కు పంపించాల్సి ఉంటుంది. ఈ జాబితా పట్ల జిల్లా కలెక్టర్/జీహెచ్ఎంసీ కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేస్తే పౌర సరఫరాల శాఖ కమిషనర్ లాగిన్‌కు పంపిస్తారు.
దీని ఆధారంగానే పౌర సరఫరాల శాఖ కమిషనర్ కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తారు. అర్హత కలిగిన వ్యక్తికి ఒకే ఒక్క రేషన్ కార్డు ఉండేలా చర్యలు తీసుకుంటారు అధికారులు. రేషన్ కార్డుల్లో సభ్యుల చేర్పులు, తొలగింపు చర్యలను సంబంధిత అధికారులు చేపడతారు. ఇందులో భాగంగా కిందటి నెల 26వ తేదీన ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు కూడా. 16,900 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు.
మరో విడతలో భాగంగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా 90 లక్షల రేషన్ కార్డులు వినియోగంలో ఉంటోన్నాయి. దీనికి అదనంగా కొత్తగా మరో ఆరు లక్షల వరకు కార్డులు అందజేయనుంది ప్రభుత్వం.












Click it and Unblock the Notifications