చంద్రబాబూ మా ప్రాజెక్టులను అడ్డుకోవద్దు.. సీఎం రేవంత్ వార్నింగ్..!
కేసీఆర్‌ను పార్లమెంట్ కు పంపింది మేము కాదా.? కేసీఆర్‌కు మేము అన్నం పెడితే మాకు సున్నం పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాపాలన చూస్తే కేసీఆర్‌కు ఎందుకు దుఃఖం వస్తుందని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ చేసినందుకు నీకు దుఃఖం వచ్చిందా.? కేసీఆర్ మనవళ్లతో పాటు మాదిగ పిల్లలు చదువుకున్నందుకు దుఃఖం వస్తుందా.? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేసీఆర్ ఏం చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొల్లాపూర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

కొల్లాపూర్‌లో రూ.200 కోట్ల యంగ్ ఇండియా స్కూల్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు. పాలమూరు అభివృద్ధికి కేసీఆర్ చేసిన అన్యాయంపై ఘాటైన విమర్శలు చేశారు. దళిత, ఆదివాసీ పిల్లల విద్య కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. తెలంగాణ వాదాన్ని గెలిపించాలంటే పాలమూరు ప్రజలు అక్కున చేర్చుకున్నారని. అలాంటి పాలమూరు గడ్డకు కేసీఆర్ చేసిందేంటి.? నడిగడ్డకు వరదలు వచ్చినప్పుడు బాధితులకు ఇళ్లు కట్టిస్తామని చెప్పి మోసం చేశారు. పాలమూరు జిల్లా అంటే కేసీఆర్ కుటుంబానికి చిన్నచూపు అని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
"కేసీఆర్ మోసపూరిత పాలన వల్లే పాలమూరు జిల్లా వెనుకబడింది. 98వ జీవోలో నిర్వాసితుల సమస్యను ఆయన పట్టించుకోలేదు. శ్రీశైలం ప్రాజెక్టు కారణంగా ఇళ్లు కోల్పోయిన ప్రజలకు సాయం చేస్తానని చెప్పి మోసం చేశారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చి, దానిని కూడా విస్మరించారు. 2019లో కాళేశ్వరం నిర్మించి 2023లో కూలిపోవడం ఆయన నిర్లక్ష్యానికి నిదర్శనం" అని సీఎం రేవంత్ అన్నారు.

పదేళ్ల వరకూ ఈ పాలమూరు బిడ్డ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటాడని స్పష్టం చేశారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు అడ్డుపడొద్దని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కోరుతున్నానని తెలిపారు. మీరు బాధ్యతగా ఉండండి.. మమ్మల్ని బతకనివ్వండంటూ విజ్ఞప్తి చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేసి ఉదారంగా వ్యవహరించాలన్నారు. మీరు సహకరించకపోతే విజ్ఞప్తులు చేస్తాం.. వినకపోతే పోరాటం ఎలా చేయాలో పాలమూరు బిడ్డలకు తెలుసన్నారు. అక్కడ సూర్యుడు ఇక్కడ మొలిచినా పాలమూరును అభివృద్ధి చేసి తీరుతామని కుండబద్దలు కొట్టారు."ఇది ఎంతో భావోద్వేగంతో కూడుకున్న సందర్భం. పాలమూరు జిల్లా అంటే కేసీఆర్ కు చిన్నచూపు. పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంట్ లో నోరు ఎత్తకపోయినా కేసీఆర్ ను పార్లమెంట్ కు పంపింది పాలమూరు జిల్లా. గుండెల్లో పెట్టి చూసుకున్న పాలమూరు గడ్డకు కేసీఆర్ ఇచ్చింది ఏంటి? నిరంజన్ రెడ్డి సమాధానం చెప్పాలి. 98 జీవో ప్రకారం పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ నిర్వాసితులను ఎందుకు ఆదుకోలేదు? వాల్మీకి సోదరులను ఎస్టీ బోయలుగా మారుస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారు. పదేళ్లలో ఈ సమస్యలను పరిష్కరించి ఉంటే పాలమూరు వాసులు మళ్లీ సమస్యపై కొట్లాడే పరిస్థితి ఉండేదా?" అని సీఎం రేవంత్ మండిపడ్డారు.

ప్రజాపాలన చూసి కెసీఆర్ కు దుఃఖం వస్తుందట. పాలమూరు గడ్డ నుంచి రేవంత్ రెడ్డి సీఎం అయిండని నీకు దుఃఖం వస్తుందా.బలహీన వర్గాల పిల్లలు చదువుకునేందుకు 25 ఎకరాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తున్నందుకు నీకు దుఃఖం వస్తుందా? పాలమూరు బిడ్డ 20 ఏండ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని కంకణం కట్టుకుని పనిచేస్తున్నందుకా నీకు దుఃఖం నలభై ఏళ్లుగా మాదిగ బిడ్డలు వర్గీకరణ కోసం పోరాడుతుంటే... మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసినందుకా నీకు దుఃఖం. నీ కొడుకు, నీ మనుమడిలాగే మాదిగ బిడ్డలు చదువుకుంటున్నందుకా నీకు కళ్లల్లో నీళ్లు వచ్చినయ్.పదేళ్లు సీఎంగా ఉండి పాలమూరు ప్రాజక్టులను కేసీఆర్ పడావు పెట్టారు
"పాలమూరు రంగారెడ్డి ని పదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదు. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులు ఎందుకుపూర్తి చేయలేదు. లక్ష కోట్లు పెట్టి ఆయన కట్టిన కాళేశ్వరం మూడేళ్లల్లో కూలేశ్వరం అయింది. పదేళ్లు నువ్వు పడావు పెట్టిన ప్రాజెక్టులను రాబోయే రెండేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళుతున్నాం. ఎందుకంత కడుపులో విషం పెట్టుకుని మాపై విషం చిమ్ముతున్నావ్. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అభినందించాల్సింది పోయి.. శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి ఆ దొంగకు సద్దులు మోస్తున్నారు. ఎవరికి ఏదీ జరగలేదు అని మాట్లాడుతున్నారు." అని సీఎం రేవంత్ అన్నారు.
"కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదన్నారు.. కానీ రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నాం. ఉచిత కరెంట్ కాంగ్రెస్ పేటెంట్.. తెచ్చింది కాంగ్రెస్ .. కొనసాగిస్తున్నది కాంగ్రెస్. వరికి బోనస్ ఇచ్చి ప్రతీ గింజ కొంటున్నాం. మొదటి ఏడాదిలోనే రూ. 21 వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేసిన ఘనత మాది. 9 రోజుల్లో 9 వేలకోట్లు రైతులకు రైతు భరోసా ఇచ్చింది మేం కాదా? రైతుల సమస్యలు పరిష్కరించడానికి ప్రజల్లోకి వెళ్లి వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం.తెలంగాణ రైతులు సంతోషంగా ఉంటే కడుపు మంటతో వాళ్లకు దుఃఖం వస్తుంది. కేసీఆర్ దుఃఖానికి కారణం రైతుల సంతోషమే తప్ప ఇంకోటి కాదు. ఆడబిడ్డలు వంటింటి కుందేళ్లు అనే ఆలోచన కేసీఆర్ ది. ఆడబిడ్డలను ప్రోత్సహించి కోటీశ్వరులను చేయాలన్న ప్రయత్నం మాది. స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించి వారికి రుణాలు అందిస్తున్నాం. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా ఆడబిడ్డలకే పాఠశాల నిర్వహణ బాధ్యత అప్పగించాం" అని సీఎం రేవంత్ తెలిపారు.
"ప్రభుత్వ కార్యాలయాల్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లను ఏర్పాటు చేసి ఆడబిడ్డల్ని వ్యాపారాల్లో ప్రోత్సహిస్తున్నది నిజం కాదా? సోలార్ ప్లాంట్ ఏర్పాటు, పెట్రోల్ బ్యాంకుల ఏర్పాటుకు ప్రోత్సహించి అంబానీ అదానీతో పోటీ పడేలా ఆడబిడ్డలకు అప్పగించాం. ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి ఈ 18 నెలలల్లో 6500 కోట్లు ఖర్చు చేశాం. ఆర్టీసీలో వెయ్యి బస్సులకు మహిళలను యజమానులను చేశాం. మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పూర్తి చేశాం. రెండున్నర సంవత్సరాలు పూర్తయ్యేలోగా లక్ష ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత మాది. ఏడాదిన్నరలోగా ఇక్కడ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం పూర్తి చేస్తాం. మళ్లీ ఇక్కడికి వచ్చి స్కూల్ ను ప్రారంభిస్తా" అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
"కేసీఆర్ నీ గుండెలపై రాసి పెట్టుకో. 2034 వరకు ఈ పాలమూరు బిడ్డ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటాడు. పాలమూరు గడ్డ నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తాడు. మా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అడ్డుపడొద్దని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కోరుతున్నా. మీరు బాధ్యతగా ఉండండి. మమ్మల్ని బ్రతకనివ్వండి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేసి ఉదారంగా వ్యవహరించండి. మీరు సహకరించకపోతే విజ్ఞప్తులు చేస్తాం. మా విజ్ఞప్తులను వినకపోతే పోరాటం ఎలా చేయాలో పాలమూరు బిడ్డలకు తెలుసు. అక్కడ సూర్యుడు ఇక్కడ మొలిచినా పాలమూరును అభివృద్ధి చేసితీరుతాం" అని సీఎం రేవంత్ తెలిపారు.












Click it and Unblock the Notifications