ఢిల్లీలో టీ కాంగ్రెస్ నేతలు ; రాహుల్ గాంధీతో ఇవాళ భేటీ.. తెలంగాణలో వర్గ విభేదాలపై కీలక చర్చ!!
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. సాయంత్రం రాహుల్ గాంధీని కలవనున్నారు. పార్టీలో అంతర్గత కమ్ములాటల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్న పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీని కలిశారు. అధిష్టానం తెలంగాణ నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వడంలేదంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై రాహుల్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తాను చూసుకుంటానని వారికి భరోసా ఇచ్చారు. ఆ మరుసటి రోజే టీ కాంగ్రెస్ నేతలకు అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది.

రాహుల్ తో టీ కాంగ్రెస్ నేతల కీలక భేటీ
ఢిల్లీలో సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చారు. తుగ్లక్ రోడ్ లోని రాహుల్ నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ఈ కీలక భేటీకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్స్ గీతారెడ్డి, అంజన్ కమార్ యాదవ్, అజారుద్ధీన్, మహేష్ కుమార్ గౌడ్, పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మధుయాష్కీ, దామోదర్ రాజనర్సింహ, మహేశ్వర్ రెడ్డి, బలరాం నాయక్ హాజరుకానున్నారు.

పార్టీలో విభేదాలపై చర్చ..
ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, సభ్యత్వ నమోదుపై రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి వివరించనున్నారు. డిజిటల్ మెంబర్ షిప్ కు సంబంధించిన చెక్ ను రాహుల్ కు కాంగ్రెస్ నేతలు అందజేయనున్నారు. అటు పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలు, అసంత్రుప్త గళాలపై కూడా ఈసమావేశంలో చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల వర్గవిబేధాలు తారా స్థాయికి చేరాయి. పార్టీ సీనియర్ నేతలు జగ్గారెడ్డి, వీహెచ్ , మర్రిశశిధర్ రెడ్డి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో పార్టీలో నెలకొన్న అసంత్రుప్త నేతలపై కూడా చర్చించే అవకాశం ఉంది.

తెలంగాణలో రాహుల్ పర్యటన?
తెలంగాణలో మరింత దూకుడుతో వెళ్లాలని పార్టీ నేతలకు రాహుల్ దిశానిర్ధేశం చేయనున్నారు. ప్రజా సమస్యలపై పోరును ఉద్ధృతం చేసేలా కార్యచరణ రూపొందించే అవకాశం ఉంది. ముఖ్యంగా వడ్ల కొనుగోళ్ల విషయంలో పార్టీ ఉద్యమ కార్యాచరణను రాహుల్ కు రాష్ట్ర నేతలు వివరించనున్నారు. తెలంగాణలో పర్యటించాలని రాహుల్ ను ఆహ్వానించనున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేలా ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లాలని టీ కాంగ్రెస్ నేతలకు సూచించే అవకాశం ఉంది. పార్టీలో అంతర్గత విభేదాలను మరచి కలిసికట్టుగా పనిచేయాలని నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.












Click it and Unblock the Notifications