పాక్‌లోని ‘గీత’ మా కూతురే, అక్కడికి తీసుకెళ్లండి: ఖమ్మం దంపతుల వినతి
ఖమ్మం: చిన్నతనంలోనే తప్పిపోయి పాకిస్థాన్‌లోని ఓ స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో ఉంటున్న మూగ, చెవిటి యువతి గీత తమ బిడ్డేనని ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గ్రామానికి చెందిన జజ్జెర కృష్ణయ్య, గోపమ్మ దంపతులు పేర్కొంటున్నారు.
జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం గ్రామానికి చెందిన జుజ్జర కృష్ణయ్య, గోపమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు. వీరిది వ్యవసాయ కుటుంబం. 2006 జనవరి 27న ఏసు సువార్త సభలకు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు నలుగురు పిల్లలతో కలిసి వెళ్లారు.
మరుసటి రోజు జనవరి 28న చిన్న కూతురు రాణి కనిపించ లేదని ఆ దంపతులు చెబుతున్నారు. అప్పటికి ఆమె వయస్సు పదేళ్లని, ఎంత వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో ఇంటికి తిరిగి వచ్చినట్లు తెలిపారు.
నలుగురు అమ్మాయిల్లో పెద్దమ్మాయి రాజమ్మకు మతిస్థిమితం లేదని, రెండో అమ్మాయి జ్యోతికి వివాహం చేశామని, మూడో అమ్మాయి పద్మ బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నట్లు వివరించారు. నాలుగో అమ్మాయి రాణి మూగ కావడంతో ఏమీ చెప్పేది కాదన్నారు.

రాణికి నుదిటిపై పుట్టమచ్చ, చేతులకు పులిపిర్లు, కన్ను కొంచెం మెల్ల ఉందని తెలిపారు. ఇటీవల టీవీల్లో, పత్రికల్లో వచ్చిన ఫొటోలను చూస్తే తమ బిడ్డ పోలికలే కనిపిస్తున్నాయని చెప్పారు. తమను చూస్తే గుర్తు పట్టే అవకాశం ఉందని, అధికారులు ఆ యువతిని కలిసే అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు.
2006లో దిగిన రేషన్ కార్డులో కూడా తమ కూతురి పేరు ఉందని, అప్పటికే తమ బిడ్డ తప్పి పోయినా పేరు రాయించామంటున్నారు. కూతురు వద్దకు తమను తీసుకెళ్లాలని, పూర్తిస్థాయిలో విచారించి.. అవసరమయితే డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి తమ కూతురును తమకు అప్పగించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ఇది ఇలా ఉండగా, ఇప్పటికే గీత తమ బిడ్డ అంటూ ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన కొందరు దంపతులు ముందుకు రావడంతో గీత అసలు ఎవరి బిడ్డ అనే విషయం అధికారుల పూర్తిస్థాయి విచారణ అనంతరం తేలే అవకాశముంది.












Click it and Unblock the Notifications