తెలంగాణ ఎంసెట్ 2021 : నోటిఫికేషన్ విడుదల... ముఖ్య తేదీలు,వివరాలివే...
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి గురువారం(మార్చి 18) ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 20న దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుండగా.. మే 5వ తేదీతో ముగియనుంది. ఇంజనీరింగ్ పరీక్షను జూలై 7,8,9 తేదీల్లో నిర్వహించనున్నారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షను జూలై 5, 6 తేదీల్లో నిర్వహించనున్నారు.
ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు రూ.800 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు ఫీజు రూ. 400 చెల్లించాలి. రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు రూ.1600 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు రూ. 800 చెల్లిస్తే సరిపోతుంది.

ఈ పరీక్షను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరఫున జేఎన్టీయూ హైదరాబాద్(JNTUH) నిర్వహించనుంది. పరీక్ష సిలబస్ విషయానికి వస్తే.. ఫస్ట్ ఇయర్ ఇంటర్ నుంచి 55 శాతం ప్రశ్నలు, సెకండ్ ఇయర్ నుంచి 45 శాతం ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో అభ్యర్థులు 180 నిమిషాల్లో 160 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్
https://eamcet.tsche.ac.in/ లో చూడవచ్చు.
గతేడాది కరోనా కారణంగా రెండుసార్లు వాయిదా పడ్డ ఎంసెట్ పరీక్ష ఎట్టకేలకు సెప్టెంబర్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు 1,43,326 మంది దరఖాస్తు చేసుకోగా, 1,19,183 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తంగా 89,734 మంది ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్,మెడికల్ విభాగంలో 78,978 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 63,857 మంది హాజరయ్యారు. వీరిలో 59,113(92.57 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.












Click it and Unblock the Notifications