పోలీసులకు పురస్కారం.. సేవా పతకాలను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు హోం శాఖ పోలీసు శాఖలో విశేష సేవలందించిన అధికారులకు పతకాలను ప్రకటించింది. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అంతే కాకుండా తెలంగాణలో మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించే గ్రేహౌండ్స్ విభాగానికి చెందిన 9 మంది పోలీసులకు శౌర్య పతకాలు లభించాయి. వీరు విధి నిర్వహణలో ప్రాణాలకే సవాల్ గా మారే ప్రమాదకర ఆపరేషన్లలో చూపిన ధైర్యసాహసాలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది.

పోలీసు శాఖలో వివిధ రకాల సేవా పతకాలు..
మహోన్నత సేవా పతకం - 16 మందికి
ఉత్తమ సేవా పతకం - 92 మందికి
కఠిన సేవా పతకం - 47 మందికి
సేవా పతకం - 461 మందికి
అలానే అవినీతి నివారణలో కీలకమైన ACB విభాగంలో పనిచేసే ఒకరికి మహోన్నత సేవా పతకం, నలుగురికి ఉత్తమ సేవా పతకాలు, 17 మందికి సాధారణ సేవా పతకాలు లభించాయి. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం సేవలకూ గుర్తింపు లభించింది. ఉత్తమ సేవా పతకం - 1, సాధారణ సేవా పతకాలు - 5 ఈ విభాగంలోని అధికారులు పొందారు. డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసు విభాగంలో ఇద్దరికి శౌర్య పతకాలు, ఒకరికి మహోన్నత సేవా పతకం, ముగ్గురికి ఉత్తమ సేవా పతకాలు, 14 మందికి సాధారణ సేవా పతకాలు లభించాయి.
ఎస్‌పిఎఫ్ విభాగంలో ఒకరికి మహోన్నత సేవా పతకం, ముగ్గురికి ఉత్తమ సేవా పతకాలు, 15 మందికి సాధారణ సేవా పతకాలు లభించాయి. వివిధ ప్రభుత్వ, ప్రముఖ వ్యక్తుల భద్రత కోసం నిరంతరం పనిచేస్తూ ఈ విభాగం చూపిన శ్రద్ధకు ఇది గౌరవ సూచకం. ఈ సంవత్సరం మొత్తంగా 683 మంది పోలీసు ఉద్యోగులకు వివిధ రకాల సేవా పతకాలు ప్రకటించబడ్డాయి. ఇది పోలీసు శాఖలో పనిచేస్తున్నవారికి ఒక గుర్తింపు, ఉత్సాహం, మరియు నిబద్ధతకు గుర్తింపు లాంటిదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.












Click it and Unblock the Notifications