తెలంగాణలో భారీ ప్రాజెక్టులు- రేవంత్ ప్రభుత్వంతో మెఘా ఒప్పందాలు
CM Revanth Reddy visits Davos: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన దావోస్ పర్యటన.. అద్భుత ఫలితాలను అందిస్తోంది. భారీ విస్తృతంగా భారీ పెట్టుబడులను సాధిస్తోంది. పలు కీలక రంగాల్లో ఆయా సంస్థలతో ప్రభుత్వం పరస్పర అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంటోంది.
తాజాగా మేఘా ఇంజనీరింగ్ (MEIL) కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో మూడు కీలక ఒప్పందాలను కుదుర్చుకుంది. రాష్ట్రంలో 2160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్ట్ ఏర్పాటుకు సంబంధించిన ఎంవోయూలపై సంతకాలు చేసింది. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో మెఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్‌ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ కంపెనీ కృష్ణారెడ్డి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఈ ప్రాజెక్టుపై దాదాపు 11,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. నిర్మాణ దశలో దాదాపు 1,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత అదనంగా మరో 250 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. అవసరమైన ఉద్యోగుల నియామకాలకు కంపెనీ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కూడా నిర్వహిస్తుంది.
ఈ చర్చల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 లక్ష్య సాధనలో పాలుపంచుకునేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు మెఘా కంపెనీ అధినేత ప్రకటించారు. దీంతో పాటు మెఘా కంపెనీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు మరో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
తెలంగాణ అంతటా అత్యాధునిక బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్ ప్రాజెక్టును స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూపై సంతకాలు చేశాయి. రాష్ట్రంలో ఎంపిక చేసిన ప్రదేశాలలో 100 ఎంవీహెచ్‌ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ వ్యవస్థను ఈ కంపెనీ అభివృద్ధి చేస్తుంది. దీనికి రూ.3,000 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది.
దీంతో రెండేండ్లలో 1,000 మందికి ప్రతక్ష్య ఉద్యోగాలు, 3,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఇంధన నిల్వ, గ్రిడ్ స్థిరత్వం, పీక్ లోడ్ నిర్వహణలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుంది. మెఘా కంపెనీ పర్యాటక రంగంలోనూ పెట్టుబడులకు ముందుకొచ్చింది. అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్‌నెస్ రిసార్ట్ ఏర్పాటు చేసేందుకు మెఘా కంపెనీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
హైదరాబాద్‌కు చెందిన మౌలిక సదుపాయాల సంస్థ భాగస్వామ్యంతో ఈ రిసార్ట్‌ను అభివృద్ధి చేయడానికి 1,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే దాదాపు రెండు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది.












Click it and Unblock the Notifications