షియా మహిళలను ప్రార్థనా మందిరాల్లోకి అనుమతించాలి: హైకోర్టు ఉత్తర్వులు
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. షియా మహిళలను ప్రార్థనా మందిరాల్లోకి అనుమతించాలంటూ ముత్తవలీ కమిటీని ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మసీదు, జాషన్స్, ఇతర ప్రార్థనా మందిరాల్లోకి షియా తెగకు చెందిన మహిళలను అనుమతించకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. మహిళల పట్ల వివక్ష తగదని, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయవద్దని ధర్మాసనం స్పష్టం చేసింది.
మసీదు, జాషన్స్ తదితర పవిత్ర ప్రాంతాల్లో ప్రార్థనలకు షియా ముస్లిం మహిళలను అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ అంజుమన్ ఎ అలవి, షియా ఇమామియా ఇత్నా అషారి అక్బరీ సొసైటీ కార్యదర్శి ఆస్మా ఫాతిమా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు. పిటిషన్ తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇబ్దత్ ఖానాకు చెందిన ముత్తవలీల కమిటీ కేవలం షియా తెగకు చెందిన మహిళలను అనుమతించడం లేదని చెప్పారు.

ప్రార్థనల నిమిత్తం ప్రార్థనా మందిరాల్లోకి అనుమతించాలని వక్ఫ్ బోర్డుకు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించడం లేదని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. వక్ఫ్ బోర్డు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఖురాన్ ప్రకారమే ప్రార్థనా మందిరాల్లోకి అనుమతి ఉంటుందని తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక.. మహిళల పట్ల వివక్ష ప్రదర్శించడం తగదని, రాజ్యాంగం హక్కులను హరించడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
ఖురాన్, బైబిల్, తోహా, భగవద్గీత, ఒక యోగి ఆత్మకథ తదితర గ్రంథాల్లోని అంశాలతో పాటు వివేకానంద.. మహిళల గురించి పేర్కొన్న పలు అంశాలను ఈ సందర్భంగా న్యాయమూర్తి చదివి వినిపించారు. షియా మహిళలను ప్రార్థనా మందిరాల్లోకి అనుమతించాలంటూ ముత్తవలీ కమిటీని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.












Click it and Unblock the Notifications