వరుసకు కొడుకు అయ్యే అబ్బాయితో ఎఫైర్.. భర్తను చంపిన భార్య
ఇటీవలికాలంలో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వావివరసలు మరిచి కొందరు ప్రవర్తిస్తున్నారు. అక్రమ సంబంధాలతో తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ వరుసకు కొడుకు అయ్యే అబ్బాయితో ఎఫైర్ పెట్టుకుని అడ్డుగా ఉన్న భర్తను కడతేర్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటకొచ్చింది. దాంతో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏం జరిగిందంటే..?
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రాపోలు దానయ్య, శారద దంపతులు. వీరికి 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. వీళ్లు గ్రామంలోనే వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే దానయ్య సోదరుడి కొడుకు శివ(19) తో శారద వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న దానయ్య పద్దతి మార్చుకోవాలని పలుమార్లు వారిని హెచ్చరించారు. అయినా తీరు మార్చుకోకుండా శివతో శారద వివాహేతర సంబంధం కొనసాగించింది.
ఇక ఈ నెల 23న భర్తతో కలిసి పొలానికి వెళ్లిన శారద.. వాష్ రూమ్ కు వెళ్తున్నానని చెప్పి అప్పటికే పొదల్లో ఉన్న శివ వద్దకు వెళ్లింది. శారద ఎంతకూ తిరిగి రాకపోవడంతో చెట్ల పొదల్లో వెతకగా.. శివ, శారద సన్నిహితంగా ఉండడం చూశాడు దానయ్య. వెంటనే కోపంతో పక్కనే ఉన్న కర్రతో వాళ్లను కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ కర్రను శివ లాక్కొని దానయ్య తలపై బాదడంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆయన పారిపోయే ప్రయత్నం చేయగా శివ, శారద ఇద్దరూ పట్టుకొని దానయ్య తలపై బండరాయితో కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.

ఆ తర్వాత దానయ్య ఎక్కడా కనిపించడం లేదంటూ అతని తమ్ముడు శ్రీనుకు ఫోన్ చేసి చెప్పింది శారద. అయితే పొదల్లో విగతజీవిగా పడి ఉన్న దానయ్యను చూసి శ్రీను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. విచారణ సమయంలో శారద పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దాంతో అదుపులోకి తీసుకొని విచారించగా శివతో కలిసి తానే హత్య చేసినట్లు నేరం అంగీకరించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి శారద, శివ ఇద్దరినీ అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications