తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్: పీఆర్సీ ఏర్పాటు, మధ్యంతర భృతి ఎంతంటే?
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. నూతన వేతన సవరణ సంఘాన్ని (PRC) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్ శివశంకర్ ఛైర్మన్‌గా పీఆర్సీని ఏర్పాటు చేశారు. సభ్యుడిగా మరో విశ్రాంత అధికారి బీ రామయ్యను నియమించారు. పీఆర్సీకి బాధ్యతలు నిర్వర్తించేందుకు కావాల్సిన నిధులను, సిబ్బందిని సమకూర్చాలని ఆర్థిక శాఖను ఆదేశించింది.

ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి ఆరు నెలల్లోపు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అప్పటి వరకూ ఉద్యోగులకు 5 శాతం మధ్యంతర భృతి(IR) ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పీఆర్సీ కమిటీ వేయడం పట్ల రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఐఆర్ 5 శాతం కాకుండా 18 శాతం ఇవ్వాలని కోరుతున్నారు.
పీఆర్సీ కమిటీ చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ ఎన్ శివశంకర్, సభ్యుడిగా రిటైర్డ్ ఐఏఎస్ బీ రామయ్యలను నియమించడంతోపాటు ఇంటెరిం రిలీఫ్ ప్రకటించినందుకు రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మామిళ్ళ రాజేందర్, మారం జగదీశ్వర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో రెండు పీఆర్సీలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే ఉందని మామిళ్ళ రాజేందర్, మారం జగదీశ్వర్ చెప్పారు.
వచ్చే పీఆర్సీలో కూడా ఉద్యోగుల ఆకాంక్షల మేరకు మంచి ఫిట్‌మెంట్‌తో నూతన వేతన సవరణ ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులంతా ప్రభుత్వ ఆకాంక్షల మేరకు కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. త్వరలో సీఎం కేసీఆర్‌ను కలిసి మెరుగైన ఇంటరీమ్ రిలీఫ్ విడుదల చేయాలని, ఉద్యోగుల మిగతా సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతామని మామిళ్ల రాజేందర్, మారం జగదీశ్వర్ తెలిపారు. ఆరోగ్య కార్డులు (ఈహెచ్ఎస్), కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు, డీఏ తదితర పెండింగ్ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటామని వెల్లడించారు.












Click it and Unblock the Notifications