‘స్టేట్స్ ఆఫ్ ది స్టేట్స్’: తెలంగాణకు వరుసగా రెండోసారి ఇండియాటూడే అవార్డు
న్యూఢిల్లీ: వరుసగా రెండో సంవత్సరం 'ఇండియాటుడే స్టేట్స్ ఆఫ్ ద స్టేట్స్ కాన్‌క్లేవ్-2015' పురస్కారానికి తెలంగాణ రాష్ట్రం ఎంపికైంది. విద్య, వైద్యం, తాగునీరు, పారిశుద్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, పన్ను వసూళ్లు తదితర పలు రంగాల్లో ఆయా రాష్ర్టాలు సాధించిన ఫలితాలను పరిగణనలోకి తీసుకుని ఇండియాటుడే సంస్థ ఉత్తమ రాష్ర్టాలను ఎంపిక చేసింది.
శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన 13వ ఇండియాటుడే సదస్సులో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ చేతులమీదుగా సమీకృత అభివృద్ధి విభాగంలో అవార్డును రాష్ట్ర మంత్రి కెటి రామారావు అందుకున్నారు.
అనంతరం కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. వరుసగా రెండో సంవత్సరం అవార్డు రావడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో అన్ని విభాగాల్లో పురస్కారాలు అందుకోవడానికి కృషి చేస్తామని తెలిపారు.

వివిధ రంగాల్లో రాష్ట్రం సాధించిన పురోగతిని పరిశీలించి ఈ అవార్డుకి తెలంగాణను ఎంపిక చేశారని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఒకవైపు అభివృద్ధి, రెండోవైపు సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తున్నామని చెప్పారు.
గత సంవత్సరంగానీ, ఈ సంవత్సరంగానీ తెలంగాణ రాష్ర్టానికి వచ్చిన ఇండియాటుడే అవార్డులు సీఎం ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆలోచనా విధానం, ప్రభుత్వ యంత్రాంగం సమిష్టి కృషి, ప్రజల సహకారానికి దక్కుతుందన్నారు. కాగా, అన్ని రంగాల్లో ఉత్తమ పనితీరు, పరిశుభ్రత, పెట్టుబడుల ఆకర్షిస్తున్న రాష్ట్రంగా గుజరాత్ అవార్డులు అందుకుంది.












Click it and Unblock the Notifications