తెలంగాణలో 'పని మొదలుపెట్టిన' చంద్రబాబు!
తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మార్పుచెందిన తర్వాత ఏపీ, కర్ణాటక, ఢిల్లీలోను బీఆర్ఎస్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. ఇన్ని సంవత్సరాల నుంచి తెలంగాణ సెంటిమెంట్ ను నమ్ముకున్న పార్టీ ఇకనుంచి దేశం మొత్తానికి విస్తరించబోతోంది. బీఆర్ఎస్ గా మారడంతో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నెత్తిన పాలుపోసినట్లైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోను సెంటిమెంట్ ను అడ్డంపెట్టుకొని గట్టెక్కిన టీఆర్ఎస్ ఇకముందు ఎటువంటి వ్యూహాలు అవలంబిస్తుందో వేచిచూడాల్సి ఉంది. సమైక్యవాద పార్టీలుగా ముద్రపడినవన్నీ తెలంగాణలో చాప చుట్టేశాయి. అయితే చంద్రబాబునాయుడు ప్రస్తుతం తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉన్న అవకాశాన్ని వినియోగించుకుంటూ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టారు. పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని తలపోస్తున్నారు.

21న బహిరంగ సభ
కాసాని జ్ఞానేశ్వర్‌ను తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా నియమించిన తర్వాత పార్టీ కార్యకలాపాల్లో వేగం పెరిగేలా చూస్తున్నారు. గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి రెండు సీట్లను టీడీపీ గెలుచుకుంది. పార్టీ నాయకులతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ బలంగా ఉందని, సభ నిర్వహించాలని చెప్పడంతో ఈనెల 21వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగసభకు తెలంగాణ తెలుగుదేశం శ్రీకారం చుట్టింది. చంద్రబాబునాయుడు పాల్గొనే ఈ సభలో హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు. బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని జ్ఞానేశ్వర్ పిలుపునిచ్చారు. సభ విజయవంతమయ్యేదాన్ని బట్టి రాష్ట్రంలో టీడీపీ అడుగులు ఉండబోతున్నాయి.
టీడీపీ స్వేచ్ఛాయుత రాజకీయం
వాస్తవానికి రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో ఏపీలోకంటే తెలంగాణలోనే టీడీపీ బలంగా ఉండేది. కార్యకర్తల బలం పటిష్టంగా ఉండేది. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలున్నప్పటికీ బలమైన నాయకులు లేకపోవడంతో నెమ్మదించింది. గత ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గూటికి చేరారు. ఖమ్మం తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పై చంద్రబాబు దృష్టిపెడతారని పార్టీ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణలో పట్టును నిలుపుకోవాలనుకుంటున్న చంద్రబాబు పార్టీని పూర్తిస్థాయిలో యాక్టివ్ చేయబోతున్నారు. భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి స్వేచ్ఛగా రాజకీయం చేసుకునే అవకాశాన్ని కేసీఆర్ కల్పించారు.












Click it and Unblock the Notifications