Telangana Weather : రెండు రోజుల పాటు తెలంగాణలో ఒక మోస్తరు వర్షాలు...
తెలంగాణలో ఆది,సోమవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది.ప్రస్తుతం తెలంగాణపై రుతుపవనాలు బలహీనంగా కదులుతున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉత్తర భారతం వైపు నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని పేర్కొన్నారు. రాగల 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకోవడంతో ఈసారి ఖరీఫ్ సీజన్‌కు సాగునీటికి ఢోకా లేదంటున్నారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం(అగస్టు 7) తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. ములుగు జిల్లా కాశిందేవిపేటలో అత్యధికంగా 3.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గడిచిన వారంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌తో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి.

వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టుల్లో వరద ప్రవాహం కూడా తగ్గింది. ఎగువున కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టు నిండటంతో అధికారులు గేట్లు ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరద ప్రవాహం తగ్గడంతో క్రస్ట్ గేట్లను మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 97,503 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 884.10 అడుగులుగా ఉన్నది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 212.4385 టీఎంసీలుగా ఉన్నది. కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.












Click it and Unblock the Notifications